- ముక్కుపిండైనా రుణం వసూలు
- కార్యదర్శులకు సమావేశాలు
- డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశాలు
- రికవరీలో జిల్లాది ఆఖరి స్థానం
నూజివీడు :రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడు చేస్తుందా అని ఎదురుచూస్తున్న రైతులపై మరో పిడుగు పడనుంది. ఓ వైపు రుణాలను మాఫీ చేయకపోగా, మరోవైపు కొత్త రుణాలివ్వని నేపథ్యంలో ప్రైవేటు వడ్డీవ్యాపారస్తుల వద్ద అప్పులు చేసి పంటలు సాగుచేసుకుంటున్న రైతుల నుంచి ముక్కుపిండయినా సరే సహకార రుణాలను వసూలు చేయడానికి జిల్లాలోని 50కేడీసీసీబీ బ్రాంచిల మేనేజర్లు, సూపర్‌వైజర్లతో పాటు 425 పీఏసీఎస్‌ల కార్యదర్శులను జిల్లా సహకార ఉన్నతాధికారులు సన్నద్ధం చేస్తున్నారు. దీనికి గానూ ఎన్ని ఒత్తిడిలున్నా రుణమాఫీ జాబితాలను సిద్ధం చేసినందుకు గానూ అభినందన సభ పేరుతో డివిజన్ కేంద్రాల్లో శనివారం సమావేశాలు నిర్వహించారు.
దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలతో పాటు రుణమాఫీకి అర్హత లేని వారి రుణాలను వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. వసూలుతో పాటు కొత్త రుణాల మంజూరుపై కూడా దృష్టి కేంద్రీకరించనున్నారు. అయితే రుణాలను వసూలు చేసే సమయంలో రైతుల నుంచి నిరసన జ్వాలలు ఎదురుకాకుండా ఉండేందుకు గానూ ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న సహకార వారోత్సవాల్లో రుణాలను చెల్లించేందుకు గానూరైతులను మానసిక సిద్ధం చేసేలా వారిలో చైతన్యం కలిగించాలని డివిజనల్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ తోలిక్యా, ఉన్నతాధికారులు కిరణ్‌కుమార్, వేణుగోపాల్, రమేష్‌కుమార్ నిర్ణయానికి వచ్చారు.
రుణాల వసూలును డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని, కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చెల్లించకపోతే జనవరి నెలలో వేలం పాటలు సైతం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాల రికవరీలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కృష్ణాజల్లా ఆఖరి స్థానంలో ఉందని, దీని స్థానాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో నిబంధనలకనుగుణంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు.
రూ.600 కోట్ల వరకు బకాయిలు...
జిల్లాలో సహకార రుణాలు ఈ ఏడాది మార్చి31 నాటికి రూ.844.11కోట్లు ఇచ్చారు. వీటిపై డిమాండ్ రూ. 1037.29కోట్లు ఉండగా, రూ.436.56కోట్లు మాత్రమే వసూలలు అయ్యాయి. మిగిలిన 600.72కోట్లు వసూలు కావాల్సి ఉంది. అయితే దీనిలో 50శాతం రుణమాఫీ అయినా ఇంకా రూ.300 కోట్లు వసూలు కావాల్సి ఉంటుంది.
పీఏసీఎస్ కార్యదర్శుల ఆందోళన...
ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో రైతుల వద్దకు వెళ్లి రుణాల రికవరీ చేయాలని ఒత్తిడిచేస్తే వారి నుంచి నిరసన జ్వాలలు ఎదుర్కొనాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేవరకు ఆగడమే మేలనే అభిప్రాయాన్ని అధిక శాతం కార్యదర్శులు వ్యక్తం చేశారు.