సామర్లకోట : సామర్లకోట ఇరిగేషన్ విభాగం పరిధిలోని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. శనివారం ఈ ప్రాంతంలో రైతుల సమస్యలపై ఇరిగేషన్ ఎస్‌ఈ సుగుణాకరరావు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా వ్యవహరించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమస్యలను సావధానంగా విన్న ఆయన సోమవారం సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ ఈఈ విజయకుమార్, డీఈ నరసింహారావు సోమవారం వీకే రాయపురం, సామర్లకోటల్లో పర్యటించారు. సామర్లకోట లాకుల వద్ద పెరిగిపోయిన గుర్రపుడెక్కను పరిశీలించారు. అలాగే వ్యవసాయ క్షేత్రం నుంచి వీకే రాయపురం శివారులోని సత్యవరపు పేటకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు.
ఆ మార్గాన్ని వ్యవసాయక్షేత్రం అధికారులు మూసివేయడంతో దానిపై సర్వే చేయాలని ఈఈ విజయకుమార్ జేఈ సునీతను ఆదేశించారు. తూటేరు డ్రెయిన్ మూసుకుపోవడం వల్ల పొలాలకు నీరు అందడం లేదని అన్నదాతలు వివరించారు. దీంతో గోదావరి కాలువ ఆధునికీకరణలో భాగంగా తూటేరు డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని ఈఈ హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ క్షేత్ర ముఖద్వారం నుంచి రామేశ్వరం ఎగువ, దిగువ కాలువకు నీరు వచ్చే తూము గుర్రపుడెక్క పేరుకుపోవడంతో మూసుకుపోయిందని రైతులు వివరించారు. ఆ ప్రదేశాన్ని అధికారులకు చూపించారు. డెక్కను తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
అనంతరం వీకే రాయపురంలో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వీకేరాయపురంలో ఎగువ, దిగువ కాలువలకు పుష్కలంగా నీరు వచ్చేలా చూడాలని, ఏలేరుకాలువపై వంతెన నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే బోయనపూడి వద్ద ఏలేరు కాలువకు పడిన గండి వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మించాలని కోరారు. ఈ సమస్యలపై ఎస్‌ఈకి నివేదిక అందించి, పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఈలు సునీత, అజహర్, వీకే రాయపురం సర్పంచ్ కుర్రా శ్రీనివాసు, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
Published Tue, Jan 6 2015 1:41 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement