నవంబర్ నెలాఖరుకు రైతు రుణ మాఫీ
అనపర్తి : రైతు రుణాలను నవంబర్ నెలాఖరునాటికి అంచెలంచెలుగా మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మంత్రి చినరాజప్ప గురువారం అనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతర ం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణాలను నిబంధనల మేరకు మాఫీ చేసేందుకు వచ్చే నెల నుంచి శ్రీకారం చుట్టనున్నారన్నారు.
తొలి విడతలో సుమారు రూ. 50 వేల వరకూ ఉన్న రుణాలు రద్దవుతాయని తెలిపారు. అలాగే డ్వాక్రా రుణాలు కూడా రద్దవుతాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఐటీ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. అలాగే పరిశ్రమలను నెలకొల్పే దిశలో ప్రభుత్వం పయనిస్తుందన్నారు. శాసన మండలి విప్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ 100 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు సమకూర్చుకున్న జిల్లా ఎమ్మెల్యేల్లో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముందున్నారన్నారు.
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, తుని నియోజక వర్గ ఇన్‌ఛార్జి యనమల కృష్ణుడు మాట్లాడుతూ ఐదేళ్ల టీడీపీ పాలనలో అనపర్తి నియోజకవర్గం ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలుస్తుందన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి(దొరబాబు), రాష్ట్ర టీడీపీ రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి సిరసపల్లి నాగేశ్వరరావు, పార్టీ ప్రచార కార్యదర్శి సత్తి దేవదానరెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు పడాల వెంకటరామారెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.