ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఖమ్మం కూరగాయల మార్కెట్‌లో పచ్చిమిర్చి రైతు పచ్చి దగాకు గురవుతున్నాడు. ధరల విషయంలో వ్యాపారులు చేస్తున్న నిలవుదోపిడీపై పలుమార్లు రైతులు గొడవలకు దిగారు. ఇదే అదనుగా భావించి మార్కెటింగ్‌శాఖ పచ్చిమిర్చి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక వ్యాపారుల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. మార్కెట్‌ను బంద్ చేసినప్పటికీ కొందరు రైతులు సరుకు తెస్తూనే ఉన్నారు. కొందరు వ్యాపారులు దాన్ని కొంటూనే ఉన్నారు. సంబంధిత రైతులు, వ్యాపారుల మధ్య ఓ ఒప్పందం ప్రకారం ఈ కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ మార్కెట్‌ను మూసివేశారు కాబట్టి రైతులు ఎక్కడా అమ్ముకునేందుకు వీలుకాదు అని భావించిన వ్యాపారులు ఎంచక్కా వారి ఇష్టానుసార మైన ధరకు కొనుగోలు చేస్తున్నారు. సుదూరంలో ఉన్న వరంగల్ కూరగాయల మార్కెట్‌కు తీసుకెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని కాబట్టి రైతులు తెగనమ్ముకుంటున్నారు. కోతకూళ్లు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొందరు చెట్లపైనే వదిలేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులకు మేలు
ప్రభుత్వ శాఖలు తీసుకున్న నిర్ణయం వ్యాపారులకు మరింత మేలు చేసేలా ఉంది. ధర నిర్ణయంలో ప్రభుత్వ పెత్తనం లేకపోవటంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. ముంబయి, కోల్‌కతా వ్యాపారులు చెప్పిన ధరల ఆధారంగా సరుకు రేటు పెడుతున్నామని రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సరుకు అధికంగా అమ్మకానికి వచ్చినప్పుడు వారి దగాకు అంతేలేకుండా పోతుంది. వ్యాపారులు సిండికేటై ధర విషయంలో రైతులను దోపిడీ చేయటంతో గత నెలలో రెండుసార్లు రైతులు తిరగబడ్డారు. ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. ఈ వ్యవహారంపై శాసన సభ ఉపసభాపతి భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మార్కెటింగ్ శాఖ జేడీఎం, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రంగంలోకి దిగి మార్కెట్‌ను సందర్శించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు.
పచ్చిమిర్చి కొనుగోళ్ల నిలిపివేత.. రైతులకు భారీ నష్టం
Published Wed, Nov 6 2013 5:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement