సాక్షి, సంగారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం(పీఏసీఎస్) పాలకవర్గం కమీషన్ల కోసం కక్కుర్తిపడి రైతులను నిలువెల్లా ముంచింది. ఓ ప్రైవేటు బీమా కంపెనీలో బీమా చేయించుకుంటేనే రుణాలు చెల్లిస్తామని మెలిక పెట్టి మరీ రైతుల ద్వారా ప్రీమియం కట్టించుకుంది. బీమా కాలపరిమితి ముగిసినా పునరుద్ధరణ(రెన్యూవల్) చేయకపోవడంతో రైతులు మూకుమ్మడిగా నష్టపోయారు. వెల్దుర్తి పీఏసీఎస్ చోటు చేసుకున్న బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి.. వెల్దుర్తి పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ బ్యాంకు డెరైక్టర్ టి. అనంతరెడ్డి కుమారుడు టి. నరేందర్ రెడ్డి స్థానికంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో బీమా వ్యాపారాన్ని పెంచుకోడానికి పీఏసీఎస్‌ను సదరు బీమా సంస్థ కార్యాలయంగా మార్చేశారు.
అప్పట్లో పీఏసీఎస్ సీఈఓగా పనిచేసిన నర్సింహారెడ్డి సైతం వీరికి సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ కంపెనీ బీమా చేయించుకుంటేనే రుణాలు ఇస్తామని మెలిక పెట్టి మరీ రైతుల నుంచి ప్రీమియాన్ని వసూలు చేశారు. రుణ మొత్తం ఆధారంగా ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ప్రీమియాన్ని మినహాయించుకుని మిగిలిన సొమ్మును రుణంగా ఇచ్చారు. 2007-10 మధ్యకాలంలో సుమారు 300 మంది రైతుల నుంచి రూ.20 లక్షల వరకు బీమా ప్రీమియాన్ని కట్టించుకున్నారు. పాలసీని బట్టి ఒక్కో బీమాపై 10 నుంచి 30 శాతం కమీషన్ కంపెనీ నుంచి వీరి చేతికి ముట్టినట్లు తెలుస్తోంది. చేసిన బీమాలకు ఇప్పుడు కాలపరిమితి మించిపోయినా ఇటు పీఏసీఎస్ గానీ అటు బీమా కంపెనీ గాని పునరుద్ధరణ చర్యలు తీసుకోకుండా పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలసీల పునరుద్ధరణ కోసం ప్రీమియం కట్టడానికి రైతులు పీఏసీఎస్‌కు వస్తే హైదరాబాద్‌లోని బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి కట్టుకోవాలని తిప్పి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాలపరిమితి దాటిన ఏడాదిలోపు మళ్లీ ప్రీమియం కట్టి పునరుద్ధరించుకోకుంటే పాలసీలు ప్రీ-క్లోజర్ స్థితికి చేరుకుంటాయి. అంటే, రైతులు చెల్లించిన ప్రీమియంను తిరిగి చెల్లించకుండా కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది. దీంతో రైతులు కట్టిన రూ.20 లక్షల ప్రీమియం కంపెనీపరం కానున్నాయి. కంపెనీ అధికారులతో పీఏసీఎస్ పాలకవర్గం పెద్దలు చేసుకున్న ఒప్పందం మేరకే ఇలా రైతులను నట్టేట ముంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రైతులకు సంబంధించిన పాలసీ బాండ్లను ఇంతవరకు వారికి అప్పగించకుండా గతంలో పనిచేసిన సీఈఓ తన దగ్గరే పెట్టుకోవడం దీన్ని బలపరుస్తోంది. ఈ విషయమై వెల్దుర్తి పీఏసీఎస్ డెరైక్టర్ ఎం. ఉమేశ్ రెడ్డి శుక్రవారం కలెక్టర్, జిల్లా సహకార అధికారి, డీసీసీబీ బ్యాంకు సీఈఓలకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎల్‌సీఓతో విచారణ జరింపించనున్నట్లు డీసీఓ సాయికృష్ణుడు హామీ ఇచ్చారు.
ప్రీమియం డబ్బులను తిరిగి చెల్లించాలి
వెల్దుర్తి పీఏసీఎస్‌లో రైతులతో బలవంతంగా చేయించిన బీమా పాలసీలను పునరుద్ధరించాలి. సాధ్యం కాని పక్షంలో ప్రీమియం సొమ్మును వారికి తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పీఏసీఎస్‌లో పునరుద్ధరణ ప్రీమియం స్వీకరణ కోసం కౌంటర్ ఏర్పాటు చేయాలని గతంలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలి. వీటన్నింటికీ పీఏసీఎస్ చైర్మన్, సీఈఓలు బాధ్యతగా తీసుకోవాలి.
-ఎం ఉమేష్ రెడ్డి, పీఏసీఎస్ డెరైక్టర్, వెల్దుర్తి
రైతులకు టోకరా
Published Sat, Aug 31 2013 12:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement