premium amount
-
‘చంద్రబాబూ..! రైతుల ఉసురుపోసుకోవద్దు’: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పాసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్శల కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా @ncbn ? pic.twitter.com/J2jW6kLqyA— YS Jagan Mohan Reddy (@ysjagan) October 29, 2024 రైతుల్లో ఆందోళన..టీడీపీ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపే అనే విషయం మరోసారి రుజువైంది. వ్యవసాయమంటే దండగ అని గతంలో చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భాలను చూశాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు. దీంతో రైతులు, రైతు సంఘాల నేతలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు విజయవంతంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అమలు చేసింది.ఆ పథకాన్ని ఎత్తేసి రైతులే పంటల బీమాను చెల్లించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్లు పంటలబీమాను ప్రకటించినప్పుడు తెలుసుకుని వెళ్లి డబ్బులు చెల్లించడం అనేది చాలా కష్టతరమైన పని. ఇలాంటి నేపథ్యంలో పంటల బీమాను రైతులే చెల్లించాలనటం ఎంత వరకు సబబని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రీమియం భారమైతే.. పరిష్కారం?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరోసారి ప్రీమియం బాదుడు షురూ చేశాయి. ‘కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు’.. బీమా సంస్థలు కూడా ప్రీమియం పెంచడానికి ఎన్నో కారణాలు చూపిస్తుంటాయి. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో.. గడిచిన ఏడాది కాలంలో తమ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం 25 శాతం పెరిగినట్టు 52 శాతం మంది చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ నూతన పాలసీల ప్రీమియం సైతం ఈ ఏడాది మొదటి మూడు నెలలల్లోనే 5.54 శాతం మేర పెరిగినట్టు బీమా పంపిణీ ప్లాట్‌ఫామ్ ‘పాలసీఎక్స్’ చెబుతోంది. రెక్కలు తొడిగిన పక్షి మాదిరిగా ఇలా ప్రీమియం గణనీయంగా పెరుగుతూ పోతుంటే కొత్తగా పాలసీ తీసుకునే వారికే కాదు, అప్పటికే పాలసీ తీసుకున్న వారిపైనా అదనపు భారం పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రీమియం భారం కొంత తగ్గించుకునే మార్గాలేంటన్నది చూద్దాం. ప్రీమియం ఎందుకు పెరుగుతోంది..హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం గణనీయంగా పెరిగిపోవడానికి వైద్య ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణం నిత్యావసరాలకు (వినియోగ ధరల, టోకు ధరల ఆధారిత) సంబంధించినది. ఇది 5–6 శాతం మధ్య ఉంటోంది. కానీ, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఇంతకు రెట్టింపు 14–15 శాతంగా ఉంటోంది. చికిత్సల వ్యయాలు ఈ స్థాయిలో ఏటా పెరిగిపోతుండడంతో, బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లు వస్తున్నాయి. దీంతో వాటిపై చెల్లింపుల భారం పడుతోంది. ‘‘వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వసతులు మెరుగుపడడం, ప్రాణాలను కాపాడే అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడం.. ఇవన్నీ వ్యయాలు పెరగడానికి దారితీస్తున్నాయి’’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. ఔషధాలు, ఇంప్లాంట్లు, ఇతరత్రా వ్యయాలు పెరగడం వల్లే ఆస్పత్రుల చికిత్సల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్టు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్ హెడ్ మనీష్ దొదేజా సైతం పేర్కొన్నారు. జీవనశైలి, ఇతర వ్యాధుల రిస్క్ పెరగడం కూడా అధిక క్లెయిమ్‌లకు దారితీస్తున్నట్టు చెప్పారు. ‘‘మనదేశం ప్రపంచ మధుమేహం రాజధానిగా మారుతోంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ సైతం పెరుగుతోంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు శిల్పా అరోరా తెలిపారు. కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. దీంతో బీమా సంస్థలకు పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ భారాన్ని దింపుకునేందుకు బీమా సంస్థలు విడతలవారీగా పాలసీదారులకు ప్రీమియం వాత పెడుతున్నట్టు విశ్లేషకులు చెబతున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం సవరణ ఇప్పడే మొదటిసారి కాదు. లోగడ ఒకటి రెండు సార్లు కూడా అవి సవరించాయి.అందరికీ కవరేజ్ లేకపోవడమూ కారణమే...ఇక మనదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అందరికీ లేకపోవడం కూడా ప్రీమియం అధికంగా ఉండడానికి మరొక కారణమంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బీమా సంస్థలు వ్యయాలను మరింత మంది పాలసీదారులతో పంచుకోవడానికి వీలు ఏర్పడుతుంది. దీంతో విడిగా ఒక్కొక్కరిపై పడే ప్రీమియం భారం తగ్గుతుంది. ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ సైతం మరో పిడుగులాంటిదే. ఉదాహరణకు రూ.10వేల వార్షిక ప్రీమియంపై రూ.1,800 జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. బీమా సంస్థలు వయసుల వారీగా ప్రీమియం పెంచుతుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 35 ఏళ్లు నిండి 36వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు ప్రీమియం పెరిగిపోతుంది. అలాగే 45 ఏళ్లు నిండి 46లోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రీమియం టారిఫ్‌లను బీమా సంస్థలు సవరిస్తుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికమవుతుంటాయి. దీంతో చికిత్సల క్లెయిమ్‌ల రిస్క్ పెరిగిపోతుంటుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బీమా సంస్థల ముందున్న ఏకైక పరిష్కారం ప్రీమియం బాదుడే. ఇక బీమా పాలసీ తీసుకున్న వారు కూడా పెద్ద పట్టణాల్లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో చికిత్సలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో సాధారణంగానే వైద్య చికిత్సల చార్జీలు ఎక్కుగా ఉంటాయి. దీంతో బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్ బిల్లులు వస్తున్నాయి. ఇది కూడా ప్రీమియం పెరిగేందుకు కారణమవుతోంది. ఇటీవలే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐర్‌డీఏఐ) ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. మారటోరియం పీరియడ్‌ను ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. దీనివల్ల కూడా క్లెయిమ్‌లు పెరుగుతాయన్న అంచనాతో బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తున్నాయి. వచ్చే 12 నెలల కాలంలోనూ ప్రీమియంలు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు హెల్త్ ప్లాన్ అవసరమా?హెల్త్ ప్లాన్ లేకపోతే ఆర్థికంగా కుటుంబం గుల్ల కాక తప్పదు. ప్రీమియం భారంగా మారిందని హెల్త్ ప్లాన్ ప్రీమియం కట్టడం మానేయవద్దు. ఎందుకంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. అదే సమయంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో వ్యయాలు కూడా పెరిగాయి. హెల్త్ ప్లాన్ తీసుకోకపోతే.. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, రుణాలతో గట్టెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకని ఆరోగ్య బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.– లోకల్ సర్కిల్స్ సర్వే వివరాలివి...→ 21 % మంది గడిచిన ఏడాదిలో తమ పాలసీ ప్రీమియం 50 శాతం కంటే ఎక్కువే పెరిగినట్టు చెప్పారు. 31 % మంది 25–50 % మధ్య ప్రీమియం గతేడాదితో పోలిస్తే పెరిగినట్టు తెలిపారు. → 15 శాతం మంది తమ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో ఉన్నవారే.→ మొత్తం 11,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. భారం ఎలా తగ్గించుకోవాలి? పోరి్టంగ్: ఆరోగ్య బీమా ఒకసారి కొనుగోలు చేసి మర్చిపోయే వస్తువు కాదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ పాలసీలోని సదుపాయాలు ఉన్నాయా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సహేతుక ప్రీమియంపై మరింత మెరుగైన ఫీచర్లను వేరొక బీమా సంస్థ ఆఫర్ చేస్తుంటే, అందులోకి మారిపోవడం మంచి నిర్ణయమే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకోవచ్చు. కేవలం ప్రీమియం కొంత తక్కువగా ఉందని చెప్పి పోరి్టంగ్ ఆప్షన్‌ను పరిశీలించడం సరైనది కాదు. ప్రీమియంలో చెప్పుకోతగ్గ వ్యత్యాసానికి తోడు, కొత్త సంస్థ ప్లాన్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పుడే పోరి్టంగ్ను పరిశీలించొచ్చు. పోరి్టంగ్తో వేరొక బీమా సంస్థకు మారిపోయిన తర్వాత.. అక్కడ కూడా పాలసీ రెన్యువల్ (పునరుద్ధరణ) సమయంలో ప్రీమియం పెంచరని చెప్పలేం. అన్ని బీమా సంస్థలూ తమ క్లెయిమ్, ప్రీమియం నిష్పత్తి ఆధారంగానే ప్రీమియం పెంపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కనుక ప్రీమియం పెంచినప్పుడల్లా దాన్ని తగ్గించుకునేందుకు కంపెనీని మారడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఒకేసారి మూడేళ్లు: ప్రీమియంను ఒకేసారి మూడేళ్లకు చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఇలా ఒకేసారి మూడేళ్లకు ప్రీమియం చెల్లిస్తే 10–15 శాతం ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల మూడేళ్ల పాటు ప్రీమియం పెంపు భారాన్ని తప్పించుకోవచ్చు. వయసువారీ శ్లాబు మారే ముందు మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లించడం వల్ల.. అక్కడి నుంచి మూడేళ్ల పాటు పెంపు లేకుండా చూసుకోవచ్చు. సూపర్‌టాపప్: ప్రస్తుత పాలసీలో ఎంత కవరేజీ ఉందన్నది ఒక్కసారి గమనించండి. ఒకవేళ రూ.10 లక్షల కవరేజీ ఉంటే, దాన్ని రూ.5 లక్షలకు తగ్గించుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం మరో మార్గం. దీనివల్ల బేస్ ప్లాన్ ప్రీమియం తగ్గుతుంది. సూపర్ టాపప్ చౌకగా వస్తుంది. దీనివల్ల మొత్తం మీద ప్రీమియంలో 10–15 శాతం తగ్గుతుంది. ఫ్లోటర్ ప్లాన్: అవివాహితులు ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని ఉంటే.. వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కలసి కొత్త ప్లాన్‌కు వెళ్లొద్దు. అప్పటికే ఉన్న ప్లాన్‌ను ఫ్లోటర్‌గా మార్చుకుని, జీవిత భాగస్వామిని చేర్చుకోవాలి. దీనివల్ల జీవిత భాగస్వామి ఒక్కరికే వెయిటింగ్ పీరియడ్ తదితర నిబంధనలు వర్తిస్తాయి. కొంత ప్రీమియం కూడా తగ్గుతుంది. గ్రూప్ ప్లాన్: ప్రీమియం భారంగా పరిణమిస్తే.. అప్పుడు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ప్లాన్ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. లేదంటే దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు గ్రూప్ హెల్త్‌ప్లాన్లను తమ కస్టమర్లకు తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. యాక్టివ్ హెల్త్ ప్లాన్: కొన్ని బీమా సంస్థలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే వారికి ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. రోజువారీ వ్యాయామం, నడక తదితర సాధనాలు చేయడం వల్ల అనారోగ్యం రిస్క్ తగ్గుతుందని తెలుసు. దీనివల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌ల రిస్క్ తగ్గుతుంది. పాలసీదారులను ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రోత్సహించి, తమ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు బీమా సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో 50 శాతం వరకు ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. కోపే: బీమా ప్రీమియం కట్టలేనంత భారంగా మారిపోతే.. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు కావడం కంటే.. కో పే ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఉదాహరణకు 20 % కో పే ఎంపిక చేసుకుంటే.. ప్రీమియంలోనూ అంతే మేర డిస్కౌంట్ వస్తుంది. హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నప్పుడు వచ్చే బిల్లులో 80 శాతాన్నే బీమా సంస్థ చెల్లిస్తుంది. 20 శాతాన్ని పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. నో క్లెయిమ్ బోనస్: దాదాపు అన్ని బీమా సంస్థలు నో క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి సంవత్సరం రెన్యువల్ అనంతరం 10–100 శాతం వరకు ఏటా కవరేజీని పెంచుతుంటాయి. ఇలా గరిష్టంగా 100–200 శాతం వరకు కవరేజీ పెరుగుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల హెల్త్ ప్లాన్‌పై 50 శాతం నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ ఉందనుకుంటే.. ఒక ఏడాదిలో క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరం కవరేజీ రూ.15 లక్షలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్ లేకపోతే రూ.20 లక్షలకు పెరుగుతుంది. మూడో ఏడాది క్లెయిమ్ వస్తే, అప్పుడు పెరిగిన రూ.10 లక్షల నుంచి 50 శాతం అంటే రూ.5 లక్షలను తగ్గిస్తాయి. కానీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే సుప్రీమ్ ప్లాన్‌లో సమకూరిన నో క్లెయిమ్ బోనస్‌ను క్లెయిమ్ చేసుకున్నా డిడక్షన్ అమలు చేయడం లేదు. అంటే నో క్లెయిమ్ బోనస్ కూడా కవరేజీగానే మిగిలిపోతుంది. కనుక బేస్ కవర్ రూ.5 లక్షలు తీసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌లో మెరుగైన కవరేజీని పొందొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. పెద్దలు ఉంటే వారిని ప్రత్యేక ప్లాన్ కింద వేరు చేయాలి. -
AP: వర్కింగ్ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం.48ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే 31.03.2023న జీవో నంబర్ 38 జారీ చేసిన విషయం గుర్తుచేశారు. ఈ క్రమంలో కొత్తగా అక్రిడిటేషన్ కార్డును పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం క్రింద ప్రీమియం రూ.1,250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన డబ్బులు చెల్లించి 31.03.2024 వరకు లబ్ధి పొందాలని కమిషనర్ సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్ కాపీలను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని రెండవ ఫ్లోర్లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, కమిషనర్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా కమిషనర్ తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం వాటా రూ.1,250 అన్నారు. భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను నిర్వహిస్తూ జర్నలిస్టులు చేసిన వైద్య ఖర్చులను రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సదరు రీయింబర్స్ మెంట్ క్లెయిమ్స్ ను పథకం విధివిధానాలను అనుసరించి సెటిల్ చేస్తుందన్నారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ.2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) తరహాలో వైద్య సేవలు పొందవచ్చన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్ధేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ పథకానికి వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా అదే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కోరారు. ఆరోగ్యశ్రీ లో భాగంగా 2023-24 సంవత్సరానికిగాను వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీంను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో గతంలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా వర్కింగ్ జర్నలిస్టులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవసరమైన వైద్య సేవలు పొందే వీలు కలుగుతుందన్నారు. ఈ పథకం అమలులో వర్కింగ్ జర్నలిస్టుల క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ హామీ మేరకు 104 హెల్ప్‌లైన్‌లో ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు కూడా వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగించుకోవాలని కొమ్మినేని విజ్ఞప్తి చేశారు. -
చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యా, ఆరోగ్య, ప్రమాద బీమా పాలసీలను మనలో చాలా మంది తీసుకుంటుంటాం. సమయానికి ఆయా పాలసీ ప్రీమియం చెల్లిస్తే ఫైన్ల నుంచీ తప్పించుకొనే అవకాశం ఉంది. ఒక వేళ సదరు పాలసీ ప్రీమియంను చేతిలో డబ్బులు లేక చెల్లించకపోతే ఆ పాలసీకి కాస్త బ్రేక్స్ పడే అకాశాలున్నాయి. ఐతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) పాలసీని కలిగి ఉన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ జీవిత బీమా పాలసీ ప్రీమియంను చెల్లించడానికి తమ ఈపీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవడానికి అర్హులు. ఈ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. టాక్స్, పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఈపీఎఫ్ఓ సభ్యుడు కనీసం రెండు సంవత్సరాల LIC పాలసీ ప్రీమియం వరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కలిగి ఉంటే, LIC ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాలోని తన డబ్బును ఉపయోగించవచ్చు. ఉద్యోగం కోల్పోవడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఈపీఎఫ్ఓ చందాదారులు ఈపీఎఫ్ ఖాతా నుంచి పాలసీ పునరుద్ధరణ చెల్లింపుతో వారి LIC పాలసీని కొనసాగించవచ్చును. ఈపీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించడానికి, సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ వద్ద ఫారమ్ 14ను సమర్పించాలి. అయితే, దీన్ని సమర్పించేటప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఫారమ్ 14, సమర్పణ సమయంలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనీసం రెండు సంవత్సరాల LIC ప్రీమియం మొత్తంలో ఉండేలా చూసుకోవాలి ఎల్ఐసీ ప్రీమియం పునరుద్ధరణ నిబంధనల ప్రకారం, ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన కూడా ఆయా పాలసీని పునరుద్ధరించడానికి LIC అనుమతిస్తుంది. పాలసీ పునరుద్ధరణ తేదీ నుంచి 6 నెలల తర్వాత పాలసీ పునరుద్ధరణపై ఎటువంటి ఆలస్య రుసుము విధించబడదు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పాలసీ పునరుద్ధరణ తేదీ తర్వాత LIC పాలసీని పునరుద్ధరించినప్పుడు, పాలసీ ప్రీమియంతో పాటు కొంత ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. కాగా ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ డబ్బును కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలి. -
ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు
ముంబై: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. మధ్యతరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఫ్యామిలీ ఉండదంటే అతిశయోక్తి కాదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతీ చిన్న పల్లెకు ఎల్ఐసీ విస్తరించింది. తాజాగా ఎల్ఐసీ మరో రికార్డు సృష్టించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల ద్వారా కలెక్ట్ చేసిన ప్రీమియం విలువ ఒక లక్షా 84 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుంది. అలాగే, ప్రభుత్వ బీమా సంస్థ పాలసీదారులకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఈ సంవత్సరంలో చెల్లించింది. ఎల్ఐసీ స్థాపించిననాటి నుంచి ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు అమ్మిన పాలసీల్లో ఎల్ఐసీ వాటా 74.58 శాతం. 2021 మార్చిలో ఎల్ఐసీ పాలసీల మార్కెట్ షేర్ 81.04 శాతం. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్డౌన్ కాలంలో కూడా ఎల్ఐసీ కొత్త ప్రీమియం కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో 10.11 శాతం వృద్ధితో ఎల్ఐసి వ్యక్తిగత హామీ వ్యాపారం కింద మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయాన్ని 56,406 కోట్ల రూపాయలుగా ఆర్జించింది. పెన్షన్, గ్రూప్ స్కీమ్స్‌లో కూడా రికార్డులు సృష్టించినట్టు ఎల్ఐసీ ప్రకటించింది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ.1,27,768 కోట్లు సేకరించినట్టు తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రీమియం రూ.1,26,749 కోట్లు. యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ బిజినెస్‌లో ఎల్ఐసీ ఎస్ఐఐపీ, నివేష్ ప్లస్ పాలసీలను పరిచయం చేసింది. చదవండి: యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా? -
రైతులకు టోకరా
సాక్షి, సంగారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం(పీఏసీఎస్) పాలకవర్గం కమీషన్ల కోసం కక్కుర్తిపడి రైతులను నిలువెల్లా ముంచింది. ఓ ప్రైవేటు బీమా కంపెనీలో బీమా చేయించుకుంటేనే రుణాలు చెల్లిస్తామని మెలిక పెట్టి మరీ రైతుల ద్వారా ప్రీమియం కట్టించుకుంది. బీమా కాలపరిమితి ముగిసినా పునరుద్ధరణ(రెన్యూవల్) చేయకపోవడంతో రైతులు మూకుమ్మడిగా నష్టపోయారు. వెల్దుర్తి పీఏసీఎస్ చోటు చేసుకున్న బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి.. వెల్దుర్తి పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ బ్యాంకు డెరైక్టర్ టి. అనంతరెడ్డి కుమారుడు టి. నరేందర్ రెడ్డి స్థానికంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో బీమా వ్యాపారాన్ని పెంచుకోడానికి పీఏసీఎస్‌ను సదరు బీమా సంస్థ కార్యాలయంగా మార్చేశారు. అప్పట్లో పీఏసీఎస్ సీఈఓగా పనిచేసిన నర్సింహారెడ్డి సైతం వీరికి సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ కంపెనీ బీమా చేయించుకుంటేనే రుణాలు ఇస్తామని మెలిక పెట్టి మరీ రైతుల నుంచి ప్రీమియాన్ని వసూలు చేశారు. రుణ మొత్తం ఆధారంగా ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ప్రీమియాన్ని మినహాయించుకుని మిగిలిన సొమ్మును రుణంగా ఇచ్చారు. 2007-10 మధ్యకాలంలో సుమారు 300 మంది రైతుల నుంచి రూ.20 లక్షల వరకు బీమా ప్రీమియాన్ని కట్టించుకున్నారు. పాలసీని బట్టి ఒక్కో బీమాపై 10 నుంచి 30 శాతం కమీషన్ కంపెనీ నుంచి వీరి చేతికి ముట్టినట్లు తెలుస్తోంది. చేసిన బీమాలకు ఇప్పుడు కాలపరిమితి మించిపోయినా ఇటు పీఏసీఎస్ గానీ అటు బీమా కంపెనీ గాని పునరుద్ధరణ చర్యలు తీసుకోకుండా పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలసీల పునరుద్ధరణ కోసం ప్రీమియం కట్టడానికి రైతులు పీఏసీఎస్‌కు వస్తే హైదరాబాద్‌లోని బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి కట్టుకోవాలని తిప్పి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాలపరిమితి దాటిన ఏడాదిలోపు మళ్లీ ప్రీమియం కట్టి పునరుద్ధరించుకోకుంటే పాలసీలు ప్రీ-క్లోజర్ స్థితికి చేరుకుంటాయి. అంటే, రైతులు చెల్లించిన ప్రీమియంను తిరిగి చెల్లించకుండా కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది. దీంతో రైతులు కట్టిన రూ.20 లక్షల ప్రీమియం కంపెనీపరం కానున్నాయి. కంపెనీ అధికారులతో పీఏసీఎస్ పాలకవర్గం పెద్దలు చేసుకున్న ఒప్పందం మేరకే ఇలా రైతులను నట్టేట ముంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రైతులకు సంబంధించిన పాలసీ బాండ్లను ఇంతవరకు వారికి అప్పగించకుండా గతంలో పనిచేసిన సీఈఓ తన దగ్గరే పెట్టుకోవడం దీన్ని బలపరుస్తోంది. ఈ విషయమై వెల్దుర్తి పీఏసీఎస్ డెరైక్టర్ ఎం. ఉమేశ్ రెడ్డి శుక్రవారం కలెక్టర్, జిల్లా సహకార అధికారి, డీసీసీబీ బ్యాంకు సీఈఓలకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎల్సీఓతో విచారణ జరింపించనున్నట్లు డీసీఓ సాయికృష్ణుడు హామీ ఇచ్చారు. ప్రీమియం డబ్బులను తిరిగి చెల్లించాలి వెల్దుర్తి పీఏసీఎస్‌లో రైతులతో బలవంతంగా చేయించిన బీమా పాలసీలను పునరుద్ధరించాలి. సాధ్యం కాని పక్షంలో ప్రీమియం సొమ్మును వారికి తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పీఏసీఎస్‌లో పునరుద్ధరణ ప్రీమియం స్వీకరణ కోసం కౌంటర్ ఏర్పాటు చేయాలని గతంలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలి. వీటన్నింటికీ పీఏసీఎస్ చైర్మన్, సీఈఓలు బాధ్యతగా తీసుకోవాలి. -ఎం ఉమేష్ రెడ్డి, పీఏసీఎస్ డెరైక్టర్, వెల్దుర్తి