తిత్లీని మించిన విషాదం.. ప్రభుత్వ నిర్లక్ష్యం! | Farmers Problems With Titli Cyclone Areas | Sakshi
Sakshi News home page

తిత్లీని మించిన విషాదం.. ప్రభుత్వ నిర్లక్ష్యం!

Published Sun, May 12 2019 11:40 AM | Last Updated on Sun, May 12 2019 11:40 AM

Farmers Problems With Titli Cyclone Areas - Sakshi

గత ఏడాది సంభవించిన తిత్లీ పెనుతుఫాన్లో లక్షలాది చెట్లు నేలకూలాయి. వేలాది కుటుంబాలు రోడ్డెక్కాయి. జీవనం భారమైంది. బతుకు దూరమైంది. తక్షణమే పరిహారం అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వం నానా హడావిడీ చేసింది. నష్టాల అంచనాల్లో అన్యాయాలు, అవకతవకలను పక్కన పెడితే.. కనీసం బాధితులుగా గుర్తించిన వారికి సైతం పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడం దారుణం. జిల్లావ్యాప్తంగా 6 వేలమందికి ఇంకా నష్టపరిహారం అందాల్సివుందని అధికారులే చెబుతుండగా వాస్తవానికి ఆ సంఖ్య 10 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందని రైతులు వాపోతున్నారు. 

కవిటి: నిబంధనల పేరుతో రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. తిత్లీ మిగిల్చిన విషాదం కంటే అధికారులు అనుసరిస్తున్న విధానాలే విపత్తులా మారాయి. వాస్తవంగా జరిగిన నష్టానికి అధికారులు వేసిన కాకిలెక్కలకి పొంతన లేకుండా పోయింది. భారీ ఎత్తున నష్టపోయిన రైతులకు పైసా కూడా పరిహారం అందలేదు. ఎన్నికల ముందు వరకు రకరకాలుగా ఆశ చూపిన అధికార పార్టీ నేతలు చివరకు చేతులెత్తేశారు. తాజాగా ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి కలిగిన రైతులకు పరిహారం అందదని ఉన్నతాధికారులు చెప్పడంతో బాధితులు  లబోదిబోమంటున్నారు.

వెబ్‌లాండ్‌ ఆధారంగా పరిహారం అందిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. వెబ్‌లాండ్‌ ఎంత సమర్ధంగా అమలైందీ తెలిసి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సబబని నిరసన వ్యక్తమవుతోంది. 1999 తుఫాన్‌ సమయంలో, ఆ తర్వాత రాష్ట్రంలో సంభవించిన విపత్తుల సందర్భంగా మినహాయింపులతో కూడిన పరిహారాన్ని అందించారు కానీ తిత్లీ విషయలో మాత్రం కొర్రీల మీద కొర్రీలు వేసి బాధిత రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.

హేతుబద్ధత ఏదీ?
తుఫాన్‌ నష్టపరిహారం నమోదుకు అధికారులు అవలంబించిన విధానం అశాస్త్రీయంగా ఉంది. రైతుల భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి.. పట్టాదార్‌ పాసుపుస్తకాల ఆధారంగా సర్వే నెంబర్లను ఆధార్‌ కార్డు నెంబర్‌ను అనుసంధానిస్తూ నష్టాలు నమోదు చేశారు. ఈ మేరకు కొంతమందికి పరిహారాలు చెల్లించేశారు. మిగిలిన రైతులకు తాజాగా కొత్త ఆంక్షలు విధించి వేదనకు గురిచేస్తున్నారు. వెబ్‌లాండ్‌ ఆధారంగా పరిహారం అందిస్తామని చెప్పడం విమర్శలపాలవుతోంది.

వెబ్‌లాండ్‌లో ఎంత మేర భూములు నమోదు చేశారు.. అది ఎంత సవ్యంగా సాగిందీ అందరికీ తెలిసిందే. 1బీ అడంగల్‌కు వెబ్‌లాండ్‌లోని వివరాలకు రైతు దగ్గర ఉన్న పాస్‌పుస్తకాలకు ఎక్కడా పొంతనలేదు. ఇటీవల కాలంలో మ్యుటేషన్లు కూడా సకాలంలో చేయకపోవడం, సవాలక్ష తప్పులతో మమ అనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని పరిహారం అందిస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement