తుగ్గలి: వేప..వ్యవసాయంలో రైతన్నకు నేస్తం. పంటల్లో వేప సంబంధిత ఉత్పత్తులను వాడి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చు. పంటలకు రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు, కీటకాలను నాశనం చేసే గుణాలు ఇందులో ఉన్నాయని పరిశోధనల్లో రుజువైంది. వేప ఉత్పత్తులను పంటల్లో, ధాన్యం నిలువల్లో తదితర వాటిల్లో వాడే విధం, లాభాలను వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ రెడ్డి (8886613960) సూచించారు.
వేప ఆకులు: ఎండిన వేప ఆకులు లేదా పొడిని కలిపితే నిల్వ చేసిన ధాన్యానికి పురుగులు పట్టవు. వేపాకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులకు పురుగులు చేరవు. వేపాకులు పొలంలో ఎరువుగా వేస్తే పోషకాలతో పాటు, వ్యాధినిరోధక శక్తి కలిసి వస్తాయి.
వేప గింజలు..: వేప గింజల్లో 0.3 నుంచి 0.6 శాతం అజాడివిక్టిన్ అనే మూల పదార్థం ఉంటుంది. ఇది ఘాటైన చేదు రుచి, వాసన కలిగిస్తుంది. ఈ మందులు వాడిన పైరుపై పురుగులు వాలవు, గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది. గుడ్లు పెట్టినా లార్వా దశలో రావాల్సి మార్పులు రాకుండా సంతతి తగ్గిపోతుంది. క్రమేణా పురుగులు నశిస్తాయి. పంటలకు మేలు చేస సహజ శత్రువులకు హాని కలుగజేయవు.
వేప గింజల కషాయం
10 కిలోల వేప గింజల పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణానికి 2 కిలోల సబ్బుపొడి వేసి కలియబెట్టిన తరువాత వడగట్టాలి. వచ్చిన కషాయాన్ని పైరుపై పిచికారీ చేస్తే తెల్లదోమ, ఆకుముడుత పురుగులను సమర్థవంతంగా ఆరికట్టవచ్చు. తొలి దశలో చిన్న గొంగలి పురుగు, కాయ తొలుచు పురుగును అరికట్టే అవకాశం ఉంది. నూనె తీయగా మిగిలిన పిండిని నీటిలో కలిపి ద్రావణం చేసుకోవచ్చు. 10 కిలోల పిండిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక వారం పాటు నానబెట్టి తరువాత తేటను వేరుచేసి మొక్కలపై పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వేప చెక్క (వేప పిండి)
ఇది మైలేన చిక్కటి సేంద్రియ ఎరువు. గింజ నుంచి తీసివేసిన వేప పిండిలో 5.2 శాతం నత్రజని, 11 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాష్ ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్యరక్షణకు ఉపయోగపడుతుంది. వేప పిండి ఎకరాకు 150–200 కిలోలు వాడాలి. ఇది కొన్ని బ్యాక్టీరియా తెగుళ్లను నివారిస్తుంది. నులి పురుగులను అదుపులో ఉంచుతుంది. వేప పిండిలో కలిపి యూరియాను వాడినపుడు నత్రజని నెమ్మదిగా తగ్గుతుంది. వేపపిండి 40 కేజీల ప్యాకెట్ రూ.200లకు మార్కెట్లో లభిస్తుంది.
వేప నూనె..: పంటలపై పిచికారీ చేయడం వల్ల కాయతొలుచు, రసం పీల్చు పురుగుల్ని అదుపు చేయవచ్చు. ఒక లీటరు వేప నూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాముల సబ్బుపొడి (సర్ఫ్) కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎకరాలో పిచికారీ చేయడానికి సరిపోతుంది. నూనె, నీరు కలువదు కావున ముందుగా సబ్బు పొడి వేసి బాగా కలిపి నురగ వచ్చిన తరువాత నీటిలో కలిపి వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment