సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: సాగుకు ఆటంకంగా మారుతున్న లోవోల్టేజీ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, మోటర్లు కాలిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన రైతన్నలు విద్యుత్ అధికారులను నిర్భందించారు. సమస్య పరిష్కరించేంత వరకూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన సిద్దిపేట మండలం బుస్సాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామంలో లోవోల్టేజీ సమస్యతో గత కొంతకాలంగా మోటర్లు కాలిపోతున్నాయి. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలిపినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు మంగళవారం గ్రామానికి వచ్చిన విద్యుత్ లైన్‌మెన్ మొహినోద్దిన్, కాంట్రాక్టు సిబ్బంది రవిలను నిలదీశారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే అందుకు ట్రాన్స్‌కో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిద్దరినీ మధ్యాహ్నం 12 గంటలకు గ్రామస్తులంతా స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఏఈ హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయడంతో...ట్రాన్స్‌కో ఏఈ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి విద్యుత్ లోడును తనిఖీ చేశారు. లోడు ఎక్కువగా ఉన్నందున మిరుదొడ్డి మండలం గుడికందుల ఫీడర్‌కు బుస్సాపూర్ గ్రామ వ్యవసాయ మోటార్లను అనుసంధానం చేస్తానని ఏఈ హామీ ఇవ్వడంతో శాంతించిన గ్రామస్తులు 5 గంటల తర్వాత నిర్బంధించిన విద్యుత్ సిబ్బందిని విడిచిపెట్టారు.
లోవోల్టేజీపై రైతన్నల ఆగ్రహం
Published Tue, Jan 7 2014 11:39 PM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement
Advertisement