అమ్మానుషం
బొబ్బిలి: ఆకాశంలో సగం..అవకాశాల్లో సగం..అంటూ వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చినా..కలం పట్టి అక్షర రూపం ఇచ్చినా..అవి అంతవరకే పరిమితమవుతున్నాయి. తెలిసీ తెలియక చేసిన తప్పు ఫలితమో? ఆడపిల్లగా పుట్టడం శాపమో గానీ, ఆరునెలల పసికందును కర్కశంగా వేగావతి పాల్జేసింది ఓ మాతృమూర్తి. ఏ తల్లి కన్నబిడ్డో గానీ ఆరునెలలకే గంగమ్మ ఒడిలో కలిసి పోయిందా పసిగుడ్డు. బిడ్డ ఉన్న ప్లాస్టిక్ కవరు బాడంగి మండలం పినపెంకి గ్రామం వద్ద ఉండే వంతెన దగ్గర ఆదివారం తేలుతూ వెళ్తుండడంతో కొంత మంది కంట పడింది. ఆ కవరులో ఉన్నది మృత శిశువు అని తెలియక నదిలో ఆడుకుంటున్న యువత బంతాటకు ఉపయోగించుకున్నారు. చివరకు అనుమానం వచ్చి తెరిచి చూడగా కవర్లో ఆడశిశువు మృతదేహం ఉండడంతో వెంటనే ఒడ్డుకు చేర్చారు. అక్కడున్న నేచర్ చైల్ ్డ కేర్ సంస్థ ప్రతినిధులు వరలక్ష్మి, రాజశేఖర్‌లు ఐసీడీఎస్, పోలీసులకు సమాచారాన్ని అందించారు.
బొబ్బిలి రూరల్ సీడీపీఓ వరలక్ష్మి, బాడంగి మండలం పినపెంకి గ్రామంలోని ఒకటి, రెండు కేంద్రాల అంగన్‌వాడీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం పిరిడి, పినపెంకి, పాల్తేరు గ్రామాలకు చెందిన యువత అక్కడకు చేరుకుని ఐసీడీఎస్ అధికారుల సహ కారంతో మృతశిశువును అక్కడే ఖననం చేశారు. సమాచారం అందుకున్న బొబ్బిలి ఎస్సై నాయుడు వేగావతి నది వద్దకు వచ్చి సంఘటనా స్థలం బాడంగి మండల పరిధిలోకి రావడంతో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆడపిల్ల అని తెలియడంతో గర్భం వద్దనుకుని ఆరో నెలలో బయటకు తీయించి ఈ దారు ణానికి పాల్పడి ఉంటారని సీడీపీఓ వరలక్ష్మి అనుమానం వెలిబుచ్చారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.