సచివాలయంలో కంచె!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవనాల
మధ్య బారికేడ్లు.. సీఆర్‌పీఎఫ్ పహారా
చిచ్చుపెట్టేయత్నమంటూ ఉద్యోగ సంఘాలు ధ్వజం
హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఉమ్మడిగా ఉన్న సచివాలయంలో కొత్తగా కంచెపడింది. ఇక నుంచి ఒక రాష్ట్రం ఉద్యోగులు, అధికారులు మరో రాష్ట్రం సచివాలయ భవనాల్లోకి వచ్చే వీల్లేదు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన భవనాల మధ్య బారికేడ్లను ఏర్పాటు చేసిన అధికారులు, సాయుధులైన కేంద్ర రిజర్వుడు పోలీసు బలగాలను బారికేడ్ల వద్ద ఏర్పాటు చేశారు. పాలనా సౌలభ్యం కోసం సచివాలయంలోని భవనాలను రెండు రాష్ట్రాలకు కేటాయించి, తెలంగాణ కోసం మింట్‌కంపౌండ్- ఎన్టీఆర్ గార్డెన్స్ రోడ్డులో ప్రత్యేక గేటును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సచివాలయంలోని ఏబీసీడీ బ్లాకులను తెలంగాణకు, జె,కె.ఎల్, నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకులను ఏపీకి కేటాయించారు. అయినా ఇప్పటి వరకు ఒక ప్రాంత ఉద్యోగులు మరో ప్రాంతంలోకి వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే ఇటీవల చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సచివాలయంలోకి వచ్చిన సందర్భంగా ఏపీ ఉద్యోగుల వాహనాలను తెలంగాణకు కేటాయించిన బ్లాక్‌ల దగ్గర పార్క్ చేశారు.
తెలంగాణ బ్లాకులన్నీ కార్లు, ఇతర వాహనాలతో నిండిపోవడం..ఆంధ్రప్రదేశ్ సచివాలయం గేటు నుంచి తెలంగాణకు చెందిన ఉద్యోగులు వాహనాలతో వచ్చే అవకాశం లేకుండా చేయడం వంటి కారణాలు కొంత వివాదాస్పదమయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో బారికేడ్లు ఏర్పాటు చేయమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ సచివాలయ ప్రవేశద్వారం నుంచి పాత సచివాలయం గేటు వరకు బారికేడ్లు ఏర్పాటయ్యాయి. కాగా క్యాంటీన్‌లు, పోస్టాఫీసు, బ్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ప్రాంతంలో ఉండడంతో తెలంగాణ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అయితే పోలీసు పహారా మధ్య ఎల్ బ్లాక్ వద్ద చిన్న దారిని వదిలారు.
ఉద్యోగ సంఘాల నిరసన
ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య కంచె ఏర్పాటు చే సి విభేదాలకు కారణమవుతున్నారని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రతినిధి రాజ్‌కుమార్ గుప్తా వేర్వేరుగా మీడియా సమావేశాల్లో విమర్శించారు. ముందస్తు సమచారం లేకుం డా బారికేడ్లు ఏర్పాటు బలగాలను మోహరించడం యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నదన్నారు. వెంటనే బారికేడ్లు తొలగించాలని కోరారు.