
పండగ చేసుకున్నారు.. ఇక పనిచేయాలి
నిన్నటి వరకు పండుగలు చేసుకున్నారు.. ఇక ఇప్పుడు అంతా కలిసి పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలోనే తాము స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే మూడింటిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ 19వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్నామన్నారు.
తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ను మర్చిపోలేమని ఆయన తెలిపారు. తాను పశ్చిమగోదావరి జిల్లాలో 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నానని, ప్రగతి కోసం, ప్రజల్లో చైతన్యం తేవడం కోసమే ప్రజాఉద్యమం పేరిట ఈ కార్యక్రమం చేపడుతున్నానని చంద్రబాబు అన్నారు. 12 వేలకు పైగా గ్రామాలు, 3 వేలకు పైగా మునిసిపల్ వార్డులను ఈ కార్యక్రమం కింద గుర్తించామన్నారు.