జ్వరంతో బాధపడుతున్న తోట పోలీసు, స్వర్ణలత
విజయనగరం, బొబ్బిలి రూరల్: కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ అధికారులు సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోవడంతో రోగులు సంచి వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. మండలంలో దిబ్బగుడ్డివలస ఎస్సీకాలనీలో సుమారు 10 మందికి వరకు జ్వరాలతో మంచపట్టారు. కాలనీకి చెందిన పి నరసమ్మ, తోట పారయ్య, తోట పోలీసు, స్వర్ణలత, జయలక్ష్మి, లక్ష్మి, బూరాడ పాపమ్మ తదితరులు మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు సీతయ్యపేట నుంచి వచ్చే ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద వైద్య చేయించుకుంటున్నారు. మరికొందరు బొబ్బిలిలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్ప పొందుతున్నారు. గ్రామంలో హెల్త్ సబ్‌సెంటర్ ఉన్నప్పటికీ ఏఎన్‌ఎం అందుబాటులో ఉండడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హెల్త్ సబ్‌సెంటర్ సిబ్బంది ఓఆర్‌ఎస్, ఇచ్చి చేతులు దులుపుకున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు అంటున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి వ్యాధుల నివరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మంచం పట్టిన కైలాం
మెంటాడ: మండలంలోని కైలాం గ్రామంలో పలువురు జ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడమే జ్వరాలకు కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటిలో జ్వర పీడితులు ఉన్నారని చెబుతున్నారు. కొందరు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు గజపతినగరం, విజయనగరం వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఇటీవల సంభవించిన పెథాయ్ తుఫాన్ వల్ల వాతావరణం మారడం కూడా వ్యాధులు ప్రబలుతున్నాయని పలువురు అంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో బోని కురమమ్మ, కొరిపిల్లి రామానందం, గండి చిన్నంనాయుడు, చప్ప సన్యాసమ్మ, గండి గంగమ్మ, అప్పలకొండ, గండి ఎర్రయ్య, నారాయణమ్మ, కామేష్, యశ్వంత్ కుమార్, కొరిపిల్లి రోహిత్‌నాయుడు తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టడంలేదని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment