అనారోగ్యం పాలైన రోగికి భూత వైద్యం చేస్తున్న మంత్రగాడు
గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి ఇంటా భూత వైద్యులు అందించిన తాయెత్తులు... యంత్రాలు... మళ్లీ కనిపిస్తున్నాయి. అందరి నోటా భూతవైద్యుల మాటే వినిపిస్తోంది. వారే తమకు చికిత్స చేయగలరనీ... తమ గ్రామాల్లోని మరణ మృదంగాన్ని ఆపగలరన్న నమ్మకం వారిలో బలంగా నాటుకుపోయింది. జ్వరాల బారిన పడి సంభవిస్తున్ను వరుస మరణాలు అందరినీ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆ అవి జ్వర మరణాలు కావని తేల్చిచెబుతున్న వైద్యాధికారులు అసలు కారణం ఏమిటో వారికి తెలియజేయకపోవడమే. ఇక చేసేది లేక మళ్లీ ఆ గిరిజనం భూతవైద్యులకోసం పరుగులు తీస్తున్నారు.
సాక్షిప్రతినిధి,విజయనగరం: జిల్లాలో ఇటీవల గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు వచ్చి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మారుమూల ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు లేకపోవడం, అపారిశుద్ధ్యం పేరుకుపోవడం... ఇటీవల కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితం కావడంతో... పలురకాల రోగాల బారిన జనం పడ్డారు. జ్వరానికి ప్లేట్‌లెట్లు తగ్గిపోతుండటంతో దానిని సకాలంలో గుర్తించలేక మృత్యువాతపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఈ మరణాలు కాస్త ఎక్కువైన సంగతి విదితమే. దీనిపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరికలు చేయడమే గాకుండా ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తామని తెగేసి చెప్పడంతో అధికారులు ఆ గ్రామాలకు పరుగులు తీశారు. కానీ మరణాలకు జ్వరాలు కావని తేల్చిన వైద్యాధికారులు అసలు కారణాలు చెప్పకపోవడంతో ఇక చేసేది లేక మళ్లీ గిరిజనులుభూతవైద్యుల బాట పడుతున్నారు.
మూఢనమ్మకాలపైనే మొగ్గు
సాధారణంగా గిరిజన పల్లెల్లో నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఏ చిన్న కష్టం వచ్చినా వారు ముందుగా వెళ్లేది మంత్రగాళ్లు, భూతవైద్యుల వద్దకే. వారి అమాయకత్వాన్ని ఈ మంత్రగాళ్లు సొమ్ము చేసుకుంటుంటారు. ఆనారోగ్యానికి ‘గాలి’ సోకడమే కారణమని, మీ వాళ్లకెవరో చేతబడి చేయించేశారని వారిని భయపెడుతుంటారు. విరుగుడు కోసం కొన్ని క్షుద్ర పూజలు చేయాల్సి ఉంటుందని, దానికి డబ్బు ఖర్చువుతుందని చెప్పి జేబులు ఖాళీ చేసేస్తుంటారు. ఇప్పుడైతే జ్వరాలంటూ వెళ్లిన వారి వద్ద రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్కోసారి వారి పిచ్చి చేష్టలు శృతిమించి లైంగిక దాడులకు దారితీస్తుండటం... అమాయకులు ప్రాణాలు కోల్పోవడం... వంటి సంఘటనలు ఎక్కడో చోట రోజూ జరుగుతూనే ఉన్నప్పటికీ అవి వెలుగులోకి రావట్లేదు. కొన్నిసార్లు మాత్రం మంత్రగాళ్ల వల్ల తమకు నష్టం కలిగిందని భావిస్తే ఇక దాడులకు తెగబడటం. అవసరమైతే కొట్టి చంపేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోగా వారే వాటివైపు జనం వెళ్లేందుకు పరోక్షంగా కారకులవుతున్నారు.
చైతన్య సదస్సుల ఊసేలేదు
కొన్నేళ్ల క్రితం జిల్లా పోలీసు అధికారులు గిరిజన పల్లెల్లో ఇంద్రజాలికులతో కలిసి చైతన్య సదస్సులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన ఉన్నప్పటికీ ఆచరణలో ఎవరూ పెట్టలేకపోతున్నారు. దీంతో జనం తమకు వచ్చిన అనారోగ్యానికి కారణమేమై ఉంటుందోనని భయపడి మంత్రగాళ్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. జ్వరానికి వైద్యం చేయించుకోవడం మానేసి మంత్రాలు, తాయెత్తులు కట్టుకుంటున్నారు. ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, తాళ్లు, యంత్రాలు కడుతున్నారు. విజ్ఞాన శాస్త్రం విశ్వ వ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తుంటే విజయనగరం జిల్లా మాత్రం మూఢనమ్మకాలంటూ వెనక్కిపోతోంది. దానికి అధికారుల ప్రకటనలు కారణమవ్వడం విచారకరం.
గత మూడేళ్లలో భూతవైద్యులపై దాడులు
జిల్లాలో గత మూడేళ్లలో 2016, 2018 సంవత్సరాల్లో భూత వైద్యులపై దాడులు చేసి, హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. నలుగురిని కొట్టి చంపేశారు. మరో నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరి చారు. వీటితో పాటు ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఒక మంత్రగాడిపైన పోలీసులు 107 సీఆర్.పీసీ కేసు నమోదు చేశారు. 2017లో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment