
‘ఉపాధి’కి విఘాతం!
సాక్షి, రాజమండ్రి :ఉపాధి హామీ పథకానికి రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాలు విఘాతం కలిగించేలా ఉన్నాయి. తమను విధుల్లోంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫీల్డు అసిస్టెంట్లు సమ్మెకు దిగే యోచనలో ఉండడంతో ‘ఉపాధి’ పనులు మందగిస్తాయనికూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 7.10 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఏటా సుమారు ఐదు లక్షల వరకూ పనిదినాలు కల్పిస్తున్నారు. వ్యవసాయేతర పనుల కాలంలో కూలీలకు ఉపాధి పనులు కడుపు నింపుతున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ పనులు ఊపందుకోకపోవడంతో ఇంకా వ్యవసాయ కూలీలు ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నారు.
ఈ తరుణంలో ఉపాధి పనులకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని కూలీలు ఆశిస్తున్నారు. కానీ ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు నిర్ణయం పనులకు విఘాతం కలిగించే ఆందోళన బాటలో ఎఫ్‌ఏలుజిల్లాలో సుమారు 1050 మంది ఫీల్డు అసిస్టెంట్లు ఉన్నారు. వీరికి మంగళం పాడేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. తమ సంఘం రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో పలుమార్లు సంబంధిత మంత్రులను కలిసి తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో అసిస్టెంట్లు ఆందోళన ఉధృతం చేసేందుకు నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచి సమ్మెకు దిగి పనులు స్తంభింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.
చిరుద్యోగులపై ప్రతాపం
ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ల పాత్ర చాలా కీలకమైనది. పనుల అంచనాల నుంచి నిర్వహణ వరకూ అధికారులు వీరి సహకారం లేనిదే ముందుకు సాగలేరు. కానీ వీరికి ఇచ్చే వేతనాలు మాత్రం కనీసంగా ఉన్నాయి. గతంలో రూ.3,500 చెల్లించేవారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడంతో రూ.5,000కు పెంచినా పనుల కల్పనపై టార్గెట్లు విధించి దానితో లింకు పెట్టారు. ఎనిమిదేళ్లుగా గ్రామాల్లో ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వీరు వేరే వృత్తికి మళ్లలేక చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం వస్తుంది.. తమ ఉద్యోగాలకు భద్రత ఇస్తుందని ఆశించిన తరుణంలో అసలుకే ఎసరు పెట్టడంతో ఫీల్డు అసిస్టెంట్లు గగ్గోలు పెడుతున్నారు.
రాజకీయ కోణం
2006లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో ఫీల్డు అసిస్టెంట్ల నియామకం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం తమపై కక్ష సాధింపునకు దిగుతోందని ఎఫ్‌ఏలు ఆరోపిస్తున్నారు. ఉన్నవారిని తొలగించి టీడీపీ నేతలు తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకే ఈ తొలగింపు డ్రామాలని రాజకీయ పరిశీలకులు కూడా ఆరోపిస్తున్నారు.