బాబు మోసాలపై రాజీలేని పోరాటం
విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసగిస్తున్న వైనంపై రాజీలేని పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు. గ్రేటర్ ఐదో వార్డు పరిధిలోని మల్లయ్యపాలెంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, నేత కార్మికులను ఆదుకుంటామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆ తరువాత ఆ విషయాన్ని విస్మరించారని విమర్శించారు.
అప్పటిలో ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చేవరకు తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 19న రాష్ర్ట వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్పారు. హుదూద్ సాయం పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, 84 రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేయడమే ఇందుకు సాక్ష్యమన్నారు. రాష్ట్ర రాజధానికోసం టీడీపీ ప్రభుత్వం భూసేకరణపై ఆయన మండిపడ్డారు. ల్యాండ్‌పుల్లింగ్ పేరిట దలారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజధానికి ఎంత భూమి అవసరమో అనేదానిపై ప్రభుత్వానికి ఇప్పటికీ సరియైన అవగాహన లేదన్నారు. భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగితే సహించేంది లేదని హెచ్చరించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, కన్నా లక్ష్మీనారాయణ, పూటకో పార్టీను మార్చే జీవిత రాజశేఖర్‌లను ఏవిధంగా చేర్చుకున్నాని ప్రశ్నించారు. పార్టీ బలోపేతంలో భాగంగా డిసెంబర్‌లో మండలస్థాయి, జనవరిలో పట్టణస్థాయి, ఫిబ్రవరిలో జిల్లాస్థాయి మహా సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విజయవాడలో మార్చి 4,5,6 తేదీల్లో రాష్ట్రసాయి మహాసభలు నిర్వహిస్తామని, అదే నెల 25 నుంచి 29 వరకు పాండిచ్చేరిలో జాతీయమహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్రిత, నగర కార్యదర్శి జేవీ ప్రభాకరరావు, సహాయ కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, కార్యవర్గ సభ్యులు మార్కెండేయులు పాల్గొన్నారు.