విపక్షాల పోరుబాట | fight against on the tdp | Sakshi
Sakshi News home page

విపక్షాల పోరుబాట

Published Sat, Apr 4 2015 3:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

విపక్షాల పోరుబాట - Sakshi

విపక్షాల పోరుబాట

  ప్రభుత్వ పాలనపై సమర శంఖం
  వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు
  టీడీపీ తీరును ఎండగడుతున్న వైనం
♦  నెలరోజుల్లో పెరిగిన నిరసనల హోరు

 
సాక్షి, విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతిపక్షాలు చేపడుతున్న ఉద్యమాలతో నగరం హోరెత్తిపోతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ ఉద్యమం మొదలుకుని స్థానిక సమస్యల పరిష్కారం వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను రాజకీయ పార్టీలు ఉధృతం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధానిగా మారిన విజయవాడలో నెల రోజుల కాలంలో ఏదో ఒక నిరసన, ఆందోళన, ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ నుంచి వామపక్ష పార్టీల వరకూ అంతా నిరంతరం పోరుబాటలోనే పయనిస్తున్నారు.

ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరు

వైఎస్సార్ సీపీకి చెందిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఎ, మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్‌ను కలిసి విన్నవించారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ బీసెంట్ రోడ్డులో హాకర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఇటీవల రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఈ నిర్ణయాన్ని కార్పొరేషన్ అధికారులు వాయిదా వేశారు.

సత్యనారాయణపురంలోని సీతారామ కల్యాణమండపం వ్యవహారంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి బ్రాహ్మణ సంఘాలకు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యే బొండా ఉమాకు వ్యతిరేకంగా ర్యాలీ, నిరసన చేపట్టారు. ఈ వ్యవహరంపై బ్రాహ్మణ సంఘాలతోపాటు బీజేపీ, వామపక్షాలు ధర్నాలు చేయటంతో టీడీపీ నేతలు దిగొచ్చారు.

నష్టనివారణ చర్యలు మొదలుపెట్టి కల్యాణమండపాన్ని బ్రాహ్మణ సంఘానికి అప్పగించేలా చేస్తామని ప్రకటించారు. లెనిన్ సెంటర్‌లోని షాపులను ఖాళీ చేయించాలని ఇరిగేషన్ అధికారులు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. సుమారు 110 షాపులకు నోటీసులు జారీ చేసిన క్రమంలో వారికి మద్దతుగా గౌతంరెడ్డి పాదయాత్ర నిర్వహించారు.

కోటి సంతకాల్లో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కోటి సంతకాల కార్యక్రమం గత నెలలో మొదలుపెట్టి దాదాపు జిల్లాలో ఎనిమిది లక్షల సంతకాలు సేకరించారు. గతనెల 31న ప్రజావంచన దినం పేరుతో సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలు చేయకపోవడంపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.

వామపక్షాల ఆందోళనలు

కరెంట్ చార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాలు నిరసన చేపట్టాయి. సీపీఎం నేతలు విజయవాడ కేంద్రంగా రాష్ట్రస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీసెం ట్‌రోడ్డులో హాకర్లకు మద్దతు పలకటం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన క్రమంలో నిరసన ర్యాలీ  నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు నగర అధ్యక్షుడు సీహెచ్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఈ-చలానాల పేరుతో ఆటో వర్కర్లను పొలీసులు వేధించటాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలు కొనసాగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement