టీడీపీ నాయకులు ఇప్పుడేమయ్యారు ?
సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
హిందూపురం టౌన్ : పరిశ్రమ యాజమాన్యం తరఫున ర్యాలీలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్మికులకు అన్యాయం జరిగినా పట్టించుకోకుండా ఏమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిగి మండలంలోని ఎస్‌ఏ రావతార్ పరిశ్రమ యాజమాన్యం చట్టాలు, రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాలకార్మిక చట్టానికి విరుద్ధంగా 10 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా పని కల్పిస్తోందని మండిపడ్డారు.
అదేవిధంగా మధ్యప్రదేశ్ కార్మికుల విషయంపై కలెక్టర్, ఎస్పీ స్పందించినా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాత్రం స్పందించ లేదన్నారు. అన్యాయంగా 183మంది కార్మికులను తొలగించారని నిరసన తెలిపితే టీడీపీ నాయకులు యాజమాన్యానికి మద్దతుగా ర్యాలీ చేశారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కార్మికులకు అన్యాయం జరుగుతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోలేదని విమర్శించారు. ఎస్‌ఏ రావ్‌తార్ పరిశ్రమలో తొలగించిన 183 మంది కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి దశల వారీగా ఉద్యమం చేస్తామని టీడీపీ నాయకులు మౌనం వీడి మద్దతు పలకాలన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు రాజప్ప, నారాయణస్వామి, రాము, ముత్యాలప్ప, నరసింహులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.