ప్రత్యేక హోదా కల్పించే వరకు పోరాటం | Fight to accommodate the special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కల్పించే వరకు పోరాటం

Published Thu, Jul 23 2015 12:26 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Fight to accommodate the special status

 విజయనగరం క్రైం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు  కల్పించేంతవరకు పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో విజయనగరంలోని మెసానిక్ టెంపుల్లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు, ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మూడు జిల్లాల నాయకులకు బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అన్నిరంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనానికి పాలక వర్గాలే కారణమని మండిపడ్డారు. రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఉండాలని పార్లమెంట్‌లో మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజధాని డిజైనింగ్ ప్లాన్‌కు రాష్ట్రంలో, దేశంలో ఎవరూ లేరా సింగపూర్‌కు వెళ్లాల్సిన అవసరం వచ్చిందా అని ప్రశ్నించారు.
 
 ఆంధ్రా మేధావుల  ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ  చంద్రబాబుకు దిక్కుమాలిన సలహాదారులు ఉండడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రానికి  చంద్రబాబు హెచ్చరిక చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీకి భాగస్వామ్యపార్టీగా ఉన్న చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎయిర్‌పోర్టుకు 2వేల ఎకరాలు భూమి ఉంటే భోగాపురం  15వేల ఎకరాల భూమిని కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కె.ఎస్.చలం  మాట్లాడుతూ  భూ బదలాయింపుపై మారటోరియం జరగాలన్నారు. ఎయిర్‌పోర్టు భోగాపురంలో కాకుండా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తే మంచిదన్నారు.
 
 ఉత్తరాంధ్ర  పొలిటికల్ జేఏసీ నాయకుడు రామారావు మాట్లాడుతూ  పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా  కల్పించపోతే  కోడిగుడ్లు, టమోటాలతో ఎంపీలను తరమడానికి విశాఖ ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించగా యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దానం ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కామే శ్వరరావు, విశాఖజిల్లా కార్యదర్శి  ఏజే స్టాలిన్, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎ.విమల, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్,సీపీఐ జిల్లా   కార్యదర్శి అల్తి అప్పలనాయుడు, సహాయ కార్యదర్శి  బుగత అశోక్, సూరప్పడు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement