టీడీపీ vs బీజేపీ
కోల్డ్ వార్!
ఇరు పార్టీల నేతల నడుమ పేలుతున్న మాటల తూటాలు
కేంద్ర బడ్జెట్ తర్వాత ముదిరిన వివాదం
రాజధానిపైనా తలో మాట
విజయవాడ : మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ముసలం మొదలైందా.. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారి భగ్గుమంటాయా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. అప్పుడే ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ టీడీపీ నేతలు పెదవి విరుస్తుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ సాగిస్తున్న పాలనపై కమలనాథులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకరి తీరును మరొకరు ఎండగట్టేందుకు ఏమాత్రం జంకడం లేదు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఒకడుగు ముందే ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికల ముందు నుంచే..
సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు రెండు పార్టీల నేతలకు సుతరామూ ఇష్టం లేదు. ఆయా పార్టీల అగ్ర నేతలు కుదుర్చుకున్న ఒప్పందం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లా నాయకులు అంగీకరించక తప్పలేదు. ఎన్నికల్లో టీడీపీ గెలవడం, రాష్ట్ర మంత్రివర్గంలో కైకలూరుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కడం జరిగిపోయాయి. అయినా రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. మంత్రుల మధ్యే కాదు.. కింది స్థాయి కేడర్ వరకు విభేదాలు కనపిస్తున్నాయి.
మరింత ముదిరాయి.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రత్యేక హోదా దక్కకపోవడం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పించింది. అరుణ్ జైట్లీ బడ్జెట్ బాగానే ఉందంటూనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేతలు ఆక్రోశించారు. దీంతో బీజేపీ నేతలు సీరియస్ అవుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు సరైన ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు వెళ్లలేదని, ఇప్పటివరకు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదని, అందువల్ల నిధులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందంటూ బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చెందితే తెలుగుదేశం నేతలు స్వీట్లు పంచుకున్నారని, ఇదేమి స్నేహధర్మమంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిశోర్ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా రాష్ట్రం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో తమ పార్టీ ఎదగకుండా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇకనుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రజల్లోకి తీసుకువెళ్లతామని అంటున్నారు.
రాజధానిపై బీజేపీ గరంగరం..
ఇప్పటికే రుణమాఫీని సరిగా చేయలేక అప్రతిష్టను మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని నిర్మాణ విషయంలో వ్యవహరిస్తున్న తీరును బీజేపీ నేతలు త ప్పు పడుతున్నారు. రైతులు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న తమకు రాజధాని కమిటీలో ఏమాత్రం చోటివ్వని చంద్రబాబు విపక్షాలను సైతం సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కమలనాథులు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంత రైతులు టీడీపీకి దూరమవుతున్నారని, ఈ ప్రభావం తమ పార్టీపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. రాజధాని వల్ల వస్తున్న వ్యతిరేకతనంతా టీడీపీకి అంటగట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఇలాగే కొనసాగిస్తే మరింత దాడికి దిగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.