షార్ట్‌ఫిల్మ్ టూ ఫీచర్ ఫిల్మ్
యూ ట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్.. యూత్ క్రియేటివిటీకి మంచి వేదిక. ఫ్రెండ్స్‌తో కలిసి అతి తక్కువ ఖర్చుతో మంచి చిత్రాలు చేస్తున్నారు. తక్కువ నిడివిలో సందేశాలిస్తున్నారు. కొందరు చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు. విజయవాడ లయోల కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన దీక్షిత్‌చంద్ నాయక్ కూడా అంతే. మంచు విష్ణుతో తీయబోతున్న చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదుగుతున్నాడు. తన ఫిల్మ్ ట్రావెల్ గురించి దీక్షిత్ అంతరంగం..
సినిమానే నా ప్రపంచం
లయోల కళాశాలలో 2014లో బీటెక్ పూర్తిచేశాను. చదువుకునే రోజుల నుంచే నాకు షార్ట్‌ఫిల్మ్స్ అంటే ప్రాణం. మొదట్లో మా పేరెంట్స్ నన్ను నిరుత్సాహపరిచారు. వారిని కన్విన్స్ చేయడానికి ఆరు నెలలు పట్టింది. ఇక నా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా ఫ్రెండ్ రఘురామ్ ఎంకరేజ్‌మెంట్‌తో 2013లో ‘మై ఫ్రెండ్’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను. ఆ ఫిల్మ్‌కు కేవలం రూ.300 ఖర్చయింది. అలా ప్రారంభమైంది నా షార్ట్‌ఫిల్మ్స్ కెరీర్. ఇప్పటివరకు మొత్తం పది లఘుచిత్రాలు తీశాను. డైరెక్టర్ కావాలంటే పుస్తక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. నేను watt pad appలో వచ్చే కొత్తకొత్త ఇంగ్లిష్ నవలలు ఎక్కువగా చదువుతాను.
బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయాలి
‘లవ్ బిఫోర్ వెడ్డింగ్’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమారు 8 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ నా ఇష్టం కొద్దీ తీశాను. నాకు ఎమోషనల్ అండ్ లవ్ ఓరియెంటెడ్æ ఇష్టం. ఒకే జానర్ కాకుండా థ్రిల్లర్ కూడా చేయాలి. నేను రామ్‌గోపాల్‌వర్మ ఫ్యాన్. యండమూరి గారి నవలలు ఎక్కువగా చదువుతాను. ఆయన నవల చదువుతుంటే, కథగా మార్చి సినిమా చేయాలనేంత కోరిక కలుగుతుంది.
ప్రస్తుతం శ్రీనివాస్ గవిర్రెడ్డి (సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ డైరెక్టర్) దగ్గర మంచు విష్ణుతో రాబోయే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. నాకు మెలొడీ మ్యూజిక్ అంటే ఇష్టం. హిందీ, తమిళ చిత్రాలను ఎక్కువ ఇష్టపడతాను. నేటివిటీ కోల్పోకుండా, ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ, బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీస్తేనే సక్సెస్ అవుతాం.
2014లో విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌లో నేను తీసిన ‘మూడు ఉత్తరాలు’ ఫిల్మ్‌కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఫెస్టివల్‌కు సుమారు 90 లఘుచిత్రాలు పోటీపడ్డాయి. వైజాగ్‌లో జరిగిన పోటీలో ‘ఇలా ఎలా’ షార్ట్‌ఫిల్మ్‌కు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకున్నాను.