పాస్టర్ సంజీవులుకు అంతిమ వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సియోన్ చ ర్చి పాస్టర్ సంజీవులు అంత్యక్రియలు బుధవారం వికారాబాద్‌లో జరిగాయి. వేలాది మంది క్రైస్తవులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాస్టర్ అంత్యక్రియలకు హాజరై, ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియలకు హైదరాబాద్, రంగారె డ్డి జిల్లాలతోపాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవ సంఘాల నాయకులు తరలివచ్చారు.
కాగా, పాస్టర్ హత్యకు బాధ్యులైన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. సంజీవులు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. వైఎస్సార్ హయాంలో దళితులు, క్రైస్తవులు, మైనార్టీలకు రక్షణ ఉండేదని, వారికిప్పుడు రక్షణ కొరవడిందన్నారు. మంత్రి ప్రసాద్‌కుమార్ పాస్టర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఫాస్టర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాస్టర్ సతీమణికి రూ.25వేల నగదును సహాయంగా అందజేశారు. పాస్టర్ హత్యా ఘటనపై పోలీసులు రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటారన్నారు.