Sanjeevulu
-
పాస్టర్ హత్య కేసులో వీడిన మిస్టరీ
వికారాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఓ ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి శనివారం రిమాండుకు తరలించారు. గతంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పాస్టర్‌ను చంపింది కూడా ఈ ముఠానేనని ఎస్పీ చెప్పారు. శుక్రవారం ఎస్పీ రాజకుమారి తన కార్యాలయంలో కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన గండికోట శ్రీను అలియాస్ రామకృష్ణ, గండికోట రాజు, అదే మండలం నెమ్మాని గ్రామానికి చెందిన కడియాల ఉదయ్‌కుమార్, గుంటోజు శివలు హిందూ మతంపై అభిమానంతో మత మార్పిడీలను తీవ్రంగా వ్యతిరేకించసాగారు. గండికోట రామకృష్ణ కొంతకాలంగా హిందూ వాహిని జిల్లా ప్రచార క్‌గా పనిచేస్తూ ఏడాదిగా వికారాబాద్‌లో ఉంటున్నాడు. గతనెల 29న నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పాస్టర్‌గా పనిచేస్తున్న నామా మోజెస్‌పై గండికోట రామకృష్ణ, గండికోట రాజు, కడియల ఉదయ్‌కుమార్, గుంటోజు శివలు దాడి చే శారు. దీనికి వారు అక్కడ తమ స్నేహితులైన నాగరాజు, అనుదీప్, రవి, ఏదునూరి వంశీధర్రెడ్డిల సహకారం తీసుకున్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో మత మార్పిడీలు జరుగుతున్నాయని, దీనికి వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు సహకరిస్తున్నారని భావించారు. నిందితులు వికారాబాద్ నివాసులైన సంతోష్, రాహుల్రెడ్డిల సహకారం తీసుకున్నారు. ఈనెల 9న రామయ్యగూడలోని బేతల్ చర్చి పాస్టర్ ఫ్రాంక్లిన్పై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించారు. మరుసటి రోజు రాత్రి అయ్యప్ప కాలనీలోని సియోన్ చర్చిలో పాస్టర్ సంజీవులుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పాస్టర్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13వ తేదీన మృతిచెందిన విషయం తెలిసిందే. పాస్టర్‌పై దాడి చేసిన తర్వాత నిందితులు సంతోష్, రాహుల్‌రెడ్డి బైక్‌లపై ఓ బేకరీకి.. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి భోజనం పార్సిల్ తీసుకున్నారు. వికారాబాద్‌లోని రామకృష్ణ గదిలో గడిపిన నిందితులు మరుసటి రోజు ఉదయం కుల్కచర్ల మండలం హిందూ వాహిని బాధ్యుడైన రాఘవేందర్ స్వగ్రామం ఘనాపూర్‌కు వెళ్లి ఈనెల 16 వరకు తలదాచుకున్నారు. అప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్థానిక డీఎస్పీ నర్సింలు నేతృత్వంలో వికారాబాద్, పరిగి, మోమిన్‌పేట్ సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్లాలతోపాటు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. నార్కట్‌పల్లిలో పాస్టర్‌పై జరిగిన దాడి.. సియోన్ చర్చి పాస్టర్ సంజీవులుపై దాడి ఒకే తీరుగా ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మురం చేశారు. నిందితుల సెల్‌ఫోన్ కాల్ డేటాతో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పట్టుకున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వికారాబాద్ ఇసాఖాన్బాగ్లోని వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సంతోష్ ఇంట్లో నిందితుల్లో ఒకరైన శివ ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా హత్య మిస్టరీ వీడిందని ఎస్పీ చెప్పారు. పాస్టర్ సంజీవులు మత మార్పిడులకు పాల్పడడం వల్లే దాడి చేశామని నిందితులు చెప్పారన్నారు. సంజీవులుపై దాడిలో తనతోపాటు ఉదయ్‌కుమార్, రాజు, రామకృష్ణ ఉన్నారని నిందితుడు శివ చెప్పాడు. ప్రధాన నిందితుల్లో శివను పోలీసులు అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. నిందితులకు సహకరించిన వికారాబాద్‌కు చెందిన సంతోష్, రాహుల్‌రెడ్డి, రాఘవేందర్‌లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మిగతా ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేశాక.. పాస్టర్ హత్యలో మరిన్ని విషయాలు వెలుగుచేసే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. కాగా పాస్టర్‌పై దాడి చేసిన నలుగురు ఓ దారి దోపిడీ కేసులో అనుమానితులన్నారు. ప్రార్థనా స్థలాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. కేసు మిస్టరీ ఛేదనలో కృషి చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డితో పాటు సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయలాలను ఎస్పీ రాజకుమారి ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటస్వామి, సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్లాల ఉన్నారు. -
పాస్టర్ సంజీవులుకు అంతిమ వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సియోన్ చ ర్చి పాస్టర్ సంజీవులు అంత్యక్రియలు బుధవారం వికారాబాద్‌లో జరిగాయి. వేలాది మంది క్రైస్తవులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాస్టర్ అంత్యక్రియలకు హాజరై, ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియలకు హైదరాబాద్, రంగారె డ్డి జిల్లాలతోపాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవ సంఘాల నాయకులు తరలివచ్చారు. కాగా, పాస్టర్ హత్యకు బాధ్యులైన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. సంజీవులు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. వైఎస్సార్ హయాంలో దళితులు, క్రైస్తవులు, మైనార్టీలకు రక్షణ ఉండేదని, వారికిప్పుడు రక్షణ కొరవడిందన్నారు. మంత్రి ప్రసాద్‌కుమార్ పాస్టర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఫాస్టర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాస్టర్ సతీమణికి రూ.25వేల నగదును సహాయంగా అందజేశారు. పాస్టర్ హత్యా ఘటనపై పోలీసులు రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటారన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన పాస్టర్
వికారాబాద్/హైదరాబాద్, న్యూస్‌లైన్: దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురైన వికారాబాద్‌లోని సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు (48) సోమవారం తుదిశ్వాస వది లారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలున్నారు. నాలుగు రోజుల క్రితం వికారాబాద్‌లో సంజీవులుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఖండిస్తూ పలు క్రైస్తవ సంఘాల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. తీవ్ర గాయాలతో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరిన పాస్టర్‌ను రెండ్రోజుల కిందట కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ హోంమంత్రి సబితారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, క్రైస్తవ మత ప్రచారకులు బ్రదర్ అనిల్‌కుమార్, మలక్‌పేట ఎమ్మెల్యే బలాల తదితరులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచించారు. కానీ పాస్టర్ ప్రాణాలు దక్కలేదు. సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గోల్కొండ చౌరస్తాలోని హెబ్రోన్ చర్చికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సంజీవులుకు నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం కొల్లూరుకు చెందిన సంజీవులు నాలుగేళ్ల కిందట వికారాబాద్‌కు వచ్చారు. అప్పట్నుంచి స్థానిక సియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ప్రమీల గృహిణి. పెద్ద కూతురు హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతోంది. రెండో కూతురు ఇంటర్ ఫస్ట్ ఇయర్, కుమారుడు తొమ్మిదో తరగతి, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నారు. ఇంటికి పెద్దదిక్కు కన్నుమూయడంతో వీరంతా కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు వికారాబాద్ చర్చికి భౌతికకాయం: పాస్టర్ సంజీవులు భౌతిక కాయాన్ని మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్‌లోని సియోన్ చర్చికి తరలించనున్నారు. బుధవారం ఉదయం భౌతిక కాయాన్ని భూస్థాపన చేయనున్నారు. కఠినంగా శిక్షించాలి: పాస్టర్ సంజీవులుపై దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆయన మృతికి సీఎం కిరణ్ బాధ్యత వహించాలని క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు జీ జాన్, రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మానుయేల్ కిశోర్ డిమాండ్ చేశారు. పాస్టర్లపై దాడులు జరుగుతున్నా పాలకులు పట్టిం చుకోవడం లేదని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐసీసీ) మండిపడింది. ఈ ఘటనను క్రైస్తవ సంఘాలు ఖండించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికె వరప్రసాదరావు, క్రిస్టియన్ సోషల్ ఫోరం అధ్యక్షులు బిసప్జాన్ గుల్లపల్లి పేర్కొన్నారు. ఈ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యేల జయసుధ డిమాండ్ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన పాస్టర్ హత్యకు నిరసనగా సోమవారం రాత్రి బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముందు క్రిస్టియన్ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షుడు విజయరాజ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే జయసుధ, సినీ నటుడు రాజా, మాజీ మంత్రి మారెప్ప తదితరులు ఇందులో పాల్గొన్నారు. నిరసన తర్వాత కొందరు వెళ్లిపోగా మిగతా వారు అక్కడే ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.