వికారాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఓ ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి శనివారం రిమాండుకు తరలించారు. గతంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పాస్టర్‌ను చంపింది కూడా ఈ ముఠానేనని ఎస్పీ చెప్పారు. శుక్రవారం ఎస్పీ రాజకుమారి తన కార్యాలయంలో కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన గండికోట శ్రీను అలియాస్ రామకృష్ణ, గండికోట రాజు, అదే మండలం నెమ్మాని గ్రామానికి చెందిన కడియాల ఉదయ్‌కుమార్, గుంటోజు శివలు హిందూ మతంపై అభిమానంతో మత మార్పిడీలను తీవ్రంగా వ్యతిరేకించసాగారు. గండికోట రామకృష్ణ కొంతకాలంగా హిందూ వాహిని జిల్లా ప్రచార క్‌గా పనిచేస్తూ ఏడాదిగా వికారాబాద్‌లో ఉంటున్నాడు. గతనెల 29న నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పాస్టర్‌గా పనిచేస్తున్న నామా మోజెస్‌పై గండికోట రామకృష్ణ, గండికోట రాజు, కడియల ఉదయ్‌కుమార్, గుంటోజు శివలు దాడి చే శారు. దీనికి వారు అక్కడ తమ స్నేహితులైన నాగరాజు, అనుదీప్, రవి, ఏదునూరి వంశీధర్‌రెడ్డిల సహకారం తీసుకున్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో మత మార్పిడీలు జరుగుతున్నాయని, దీనికి వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు సహకరిస్తున్నారని భావించారు. నిందితులు వికారాబాద్ నివాసులైన సంతోష్, రాహుల్‌రెడ్డిల సహకారం తీసుకున్నారు. ఈనెల 9న రామయ్యగూడలోని బేతల్ చర్చి పాస్టర్ ఫ్రాంక్లిన్‌పై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించారు. మరుసటి రోజు రాత్రి అయ్యప్ప కాలనీలోని సియోన్ చర్చిలో పాస్టర్ సంజీవులుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పాస్టర్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13వ తేదీన మృతిచెందిన విషయం తెలిసిందే.
పాస్టర్‌పై దాడి చేసిన తర్వాత నిందితులు సంతోష్, రాహుల్‌రెడ్డి బైక్‌లపై ఓ బేకరీకి.. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి భోజనం పార్సిల్ తీసుకున్నారు. వికారాబాద్‌లోని రామకృష్ణ గదిలో గడిపిన నిందితులు మరుసటి రోజు ఉదయం కుల్కచర్ల మండలం హిందూ వాహిని బాధ్యుడైన రాఘవేందర్ స్వగ్రామం ఘనాపూర్‌కు వెళ్లి ఈనెల 16 వరకు తలదాచుకున్నారు. అప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
స్థానిక డీఎస్పీ నర్సింలు నేతృత్వంలో వికారాబాద్, పరిగి, మోమిన్‌పేట్ సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్‌లాలతోపాటు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. నార్కట్‌పల్లిలో పాస్టర్‌పై జరిగిన దాడి.. సియోన్ చర్చి పాస్టర్ సంజీవులుపై దాడి ఒకే తీరుగా ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మురం చేశారు. నిందితుల సెల్‌ఫోన్ కాల్ డేటాతో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పట్టుకున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వికారాబాద్ ఇసాఖాన్‌బాగ్‌లోని వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సంతోష్ ఇంట్లో నిందితుల్లో ఒకరైన శివ ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
తమదైన శైలిలో విచారించగా హత్య మిస్టరీ వీడిందని ఎస్పీ చెప్పారు. పాస్టర్ సంజీవులు మత మార్పిడులకు పాల్పడడం వల్లే దాడి చేశామని నిందితులు చెప్పారన్నారు. సంజీవులుపై దాడిలో తనతోపాటు ఉదయ్‌కుమార్, రాజు, రామకృష్ణ ఉన్నారని నిందితుడు శివ చెప్పాడు. ప్రధాన నిందితుల్లో శివను పోలీసులు అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. నిందితులకు సహకరించిన వికారాబాద్‌కు చెందిన సంతోష్, రాహుల్‌రెడ్డి, రాఘవేందర్‌లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మిగతా ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేశాక.. పాస్టర్ హత్యలో మరిన్ని విషయాలు వెలుగుచేసే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.
కాగా పాస్టర్‌పై దాడి చేసిన నలుగురు ఓ దారి దోపిడీ కేసులో అనుమానితులన్నారు. ప్రార్థనా స్థలాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. కేసు మిస్టరీ ఛేదనలో కృషి చేసిన సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ రవీందర్‌రెడ్డితో పాటు సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయలాలను ఎస్పీ రాజకుమారి ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటస్వామి, సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్‌లాల ఉన్నారు.
పాస్టర్ హత్య కేసులో వీడిన మిస్టరీ
Published Sun, Jan 26 2014 12:24 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement