వికారాబాద్/హైదరాబాద్, న్యూస్‌లైన్: దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురైన వికారాబాద్‌లోని సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు (48) సోమవారం తుదిశ్వాస వది లారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలున్నారు. నాలుగు రోజుల క్రితం వికారాబాద్‌లో సంజీవులుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఖండిస్తూ పలు క్రైస్తవ సంఘాల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. తీవ్ర గాయాలతో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరిన పాస్టర్‌ను రెండ్రోజుల కిందట కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ హోంమంత్రి సబితారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, క్రైస్తవ మత ప్రచారకులు బ్రదర్ అనిల్‌కుమార్, మలక్‌పేట ఎమ్మెల్యే బలాల తదితరులు పరామర్శించారు.
మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచించారు. కానీ పాస్టర్ ప్రాణాలు దక్కలేదు. సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గోల్కొండ చౌరస్తాలోని హెబ్రోన్ చర్చికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సంజీవులుకు నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం కొల్లూరుకు చెందిన సంజీవులు నాలుగేళ్ల కిందట వికారాబాద్‌కు వచ్చారు. అప్పట్నుంచి స్థానిక సియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ప్రమీల గృహిణి. పెద్ద కూతురు హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతోంది. రెండో కూతురు ఇంటర్ ఫస్ట్ ఇయర్, కుమారుడు తొమ్మిదో తరగతి, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నారు. ఇంటికి పెద్దదిక్కు కన్నుమూయడంతో వీరంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
నేడు వికారాబాద్ చర్చికి భౌతికకాయం: పాస్టర్ సంజీవులు భౌతిక కాయాన్ని మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్‌లోని సియోన్ చర్చికి తరలించనున్నారు. బుధవారం ఉదయం భౌతిక కాయాన్ని భూస్థాపన చేయనున్నారు.
కఠినంగా శిక్షించాలి: పాస్టర్ సంజీవులుపై దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆయన మృతికి సీఎం కిరణ్ బాధ్యత వహించాలని క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు జీ జాన్, రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మానుయేల్ కిశోర్ డిమాండ్ చేశారు. పాస్టర్లపై దాడులు జరుగుతున్నా పాలకులు పట్టిం చుకోవడం లేదని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐసీసీ) మండిపడింది. ఈ ఘటనను క్రైస్తవ సంఘాలు ఖండించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికె వరప్రసాదరావు, క్రిస్టియన్ సోషల్ ఫోరం అధ్యక్షులు బిసప్‌జాన్ గుల్లపల్లి పేర్కొన్నారు. ఈ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యేల జయసుధ డిమాండ్ చేశారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన
పాస్టర్ హత్యకు నిరసనగా సోమవారం రాత్రి బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముందు క్రిస్టియన్ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షుడు విజయరాజ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే జయసుధ, సినీ నటుడు రాజా, మాజీ మంత్రి మారెప్ప తదితరులు ఇందులో పాల్గొన్నారు. నిరసన తర్వాత కొందరు వెళ్లిపోగా మిగతా వారు అక్కడే ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
మృత్యువుతో పోరాడి ఓడిన పాస్టర్
Published Tue, Jan 14 2014 5:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement