ఫ్రాన్స్‌లో పాస్టర్ గొంతు కోసిన ఉగ్రవాదులు
సెయింట్ ఎటియన్ డ్యు రౌరే (ఫ్రాన్స్) : ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మళ్లీ దాడి చేశారు. నార్మండీ పట్టణ సమీపంలోని సెయింట్ ఎటియన్ డ్యు రౌరేలో మంగళవారం 86 ఏళ్ల చర్చి పాస్టర్ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. దాడిలో గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్చిని చుట్టుముట్టిన పోలీసులు ఉగ్రవాదులిద్దరినీ హతమార్చారు. ఉగ్రవాదులు చర్చిలోకి చొరబడి పాస్టర్ సహా ఐదుగురిని నిర్బంధించారు. కత్తితో పాస్టర్ గొంతు కోశారు. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.
ఒకరు మృత్యువుతో పోరాడుతుండగా, మిగిలిన ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. పాస్టర్‌ను జాక్వెస్ హామెల్‌గా గుర్తించారు. దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. ఇది తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ పేర్కొంది. ఈ దాడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్, పోప్ ఫ్రాన్సిస్ ఖండించారు.