రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారి
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారి(53) గురువారం దారుణ హత్యకు గురయ్యారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఉన్న పత్రిక కార్యాలయం నుంచి ఆయన బయటకు రాగానే ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనలో బుఖారితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొయారు. ఈ దాడిలో గాయపడ్డ మరొక భద్రతా సిబ్బందిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ పౌరుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు గురువారం సాయంత్రం 7 గంటలకు బుఖారి ఆఫీస్ నుంచి బయటకు రాగానే దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2000లో తొలిసారి బుఖారిపై దాడి జరగడంతో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశామని వెల్లడించారు. 2006లో బుఖారిని ఇద్దరు ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి చంపడానికి యత్నించగా తుపాకీ పనిచేయకపోవడంతో ఆయన అక్కడ్నుంచి తప్పించుకున్నారు.
ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బష్రత్ అహ్మద్ బుఖారికి ఈయన స్వయానా సోదరుడు. ఢిల్లీలోని కొందరు జర్నలిస్టులు మీరు పక్షపాతంతో రిపోర్టింగ్ చేస్తున్నారని గురువారం ఆరోపించగా వాటిని ఖండిస్తూ బుఖారి ట్విట్టర్‌లో బదులిచ్చారు. కశ్మీర్‌లోయలో శాంతి నెలకొనేందుకు గతంలో బుఖారి పలు సమావేశాల్ని నిర్వహించారు. అంతేకాకుండా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్–పాక్‌ల మధ్య సాగిన అనధికార ట్రాక్–2 చర్చల్లో సైతం ఆయన భాగస్వామిగా ఉన్నారు. తాజాగా బుఖారి హత్య నేపథ్యంలో మిలటరీ ఆపరేషన్లను రంజాన్ తర్వాత కేంద్రం పునఃప్రారంభించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాగా, ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు.
ఇది పిరికిపందల చర్య: రాజ్‌నాథ్
సీనియర్ జర్నలిస్ట్ బుఖారిని ఉగ్రవాదులు హత్య చేయడాన్ని పిరికిపందల చర్యగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిస్థాపనకు, న్యాయం కోసం బుఖారి అవిశ్రాంతంగా శ్రమించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. బుఖారి హత్యపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎడిటర్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా బుఖారి హత్యను ఖండించింది.
సీనియర్ జర్నలిస్ట్: శ్రీనగర్‌కు చెందిన షుజాత్ బుఖారి రైజింగ్ కశ్మీర్ అనే ఇంగ్లిష్ దినపత్రికతో పాటు బులంద్ కశ్మీర్ అనే ఉర్దూ పత్రికల్ని స్థాపించారు. వీటికి ఆయనే ఎడిటర్‌గానూ వ్యవహరిస్తున్నారు. 1997 నుంచి 2012 వరకూ కశ్మీర్‌లో హిందూ పత్రిక స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. మనీలాలోని అటెనియో డీ మనీలా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment