చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని శేషాచల అడవుల్లో శుక్రవారం మంటలు చెలరేగాయి.
రేణిగుంట: శేషాచల అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో ఈ మంటలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు వదిలేయడంతో వ్యాపించిన మంటలు అమరరాజా ఫ్యాక్టరీ, తారకరామా నగర్ వైపు వ్యాపించాయి. ఫ్యాక్టరీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఫ్యాక్టరీ వెనుక భాగం నుంచి తారకరామా నగర్ వైపు మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సీఐ బాలయ్య, అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగి స్థానికుల సహకారంతో రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎఫ్‌వో శ్రీనివాసులు ప్రమాదం గురించి మాట్లాడుతూ... శేషాచల అడవుల్లోని 3.5 హెక్టార్లలో మంటలు వ్యాపించాయని, అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.