తిరుమలలో అగ్నిప్రమాదం
తిరుమల : తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత పోలీస్‌స‍్టేషన్ సమీపంలోని అతిథి గృహం రూమ్ నంబర్ 264 లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
భక్తులు గాఢ నిద్ర ఉన్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు మేల‍్కొని మంటలను ఆర‍్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ‍్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన‍్లతో సిబ‍్బంది వచ్చి మంటలు ఆర‍్పారు. అప‍్పటికే ఆ గది పూర్తిగా కాలిపోయింది. అందులోని భక్తుల వస‍్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. భక్తులకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గది బయట చెత‍్తకుప‍్పకు ఆకతాయిలు నిప్పు పెట‍్టడంతో ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.