చంద్రగిరి : తిరుమల శేషాచలం అడవుల్లో మంగళవారం సాయంత్రం మళ్లీ కార్చిచ్చు రేగింది. తిరుమల వేద పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరంలోని గాడికోన సమీపంలో రగిలిన ఈ చిచ్చు కళ్యాణిడ్యామ్ పరిసరాల వరకు వ్యాపించింది. దాదాపు 200 హెక్టార్లకు పైగా అటవీ సంపద కాలిబూడిదైంది. అటవీశాఖ సిబ్బంది మంటలార్పేందుకు దాదాపు 70 మంది సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి వరకు శ్రమించారు. తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో 30 మంది స్ట్రైకింగ్ పోర్స్ సిబ్బంది ఫైరింజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఏడు ఫైరింజన్లతో నీళ్లు చల్లినా ఫలితం లేకపోయింది. రాత్రి 10 గంటల వరకు ఈ మంటలు అదుపులోకి రాలేదు.