కాలిపోతున్న రైలింజన్
బొబ్బిలి: విశాఖ నుంచి ఒడిశాలోని లడ్డ వెళ్తున్న రైలు ఇంజిన్‌లో మంటలు రేగడంతో బొబ్బిలి ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రాయిని తరలిస్తున్న ఈ బీటీ(బాలిష్ ట్రైన్)కి సంబంధించిన ఇంజిన్‌లోనుంచి మంటలు రేగి కాలిపోతుండటం చూసిన స్థానికులు భయాందోళన చెందారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని లడ్డ వెళ్తున్న ఈ ట్రైన్ విజయనగరం జిల్లా బొబ్బిలి, డొంకినవలస రైల్వే స్టేషన్ల మధ్యకు వచ్చే సరికి ఇంజిన్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. వెంటనే విజయనగరం, విశాఖల్లోని రైల్వే ఉన్నతాధికారులకు సమాచారమందించారు.
అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అనంతరం ఇంజిన్‌ను బొబ్బిలి జంక్షన్‌కు తరలించారు. రైల్వే ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగాయనీ రైల్వేవర్గాలు తెలిపాయి. ఈ సంఘటనలో ఇంజిన్‌కు చెందిన ముఖ్యమైన విద్యుత్‌వైర్లు కాలిపోయాయని తెలిపారు. మళ్లీ మరమ్మతులు చేసిన వెంటనే ఇంజిన్ సర్వీసులోకి వచ్చేస్తుందనీ, దీనికి లక్షల్లోనే ఖర్చవుతుందనీ ఆ వర్గాలు చెప్పాయి.
నాగావళి ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
బీటీ ఇంజిన్‌లోంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, దట్టంగా పొగ అలముకోవడంతో ఈ ప్రాంతమంతా భయానకంగా కనిపించింది. ఈ సమయంలో అటుగా వస్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌ను కొద్ది సేపు నిలిపివేసినట్టు స్థానికులు తెలిపారు. మొత్తం మీద పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment