
బెజవాడ-గుంటూరు మధ్యే తొలిదశ భూ సమీకరణ
► సీఎం బాబుతో రాజధాని నిర్మాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ
► వివరాలు వెల్లడించిన మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
► ఈ నెల 17, 18, 19 తేదీల్లో విజయవాడ, గుంటూరుల్లో మంత్రివర్గ సభ్యుల పర్యటనలు
► రాజధానికి భూములిచ్చే రైతులు వేరే చోట భూములు కొనుక్కుంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, చార్జీలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల్ని తొలిదశలో విజయవాడ-గుంటూరు మధ్యే సమీకరించాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. తొలిదశగా 30 వేల ఎకరాల్ని రైతుల నుంచి సమీకరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాజధాని నిర్మాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. శనివారం సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్‌బాబు భేటీ అయ్యారు. వీరి మధ్య రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
నయా రాయ్‌పూర్, గాంధీనగర్, చండీగఢ్ నిర్మాణానికి భూ సేకరణ ఎలా జరిగిందనే అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ చర్చల వివరాల్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. సమీకరణ అనంతరం అభివృద్ధి చేసే భూమిని 60:40 నిష్పత్తిలో కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి పల్లె తెలి పారు. రైతులకు 40 శాతం వరకు అభివృద్ధి భూమిలో వాటా వస్తుందని, అంటే ఎకరాకు వెయ్యి చదరపు గజాల వరకు భూమి దక్కుతుం దన్నారు. అసైన్డ్ భూముల విషయంలో మాత్రం 30 శాతం వరకు మాత్రమే రైతులకు వాటా దక్కుతుందని వివరించారు. అభివృద్ధి చేసిన భూమిని రైతులు అమ్ముకోకుంటే పదేళ్ల వరకు ఏటా రూ. 25 వేల వరకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సమావేశంలో నిర్ణయించామన్నారు. ఒకవేళ రైతులు భూమిని అమ్ముకుంటే మాత్రం పరిహారం ఇవ్వరన్నారు. భూ సమీకరణపై విజ యవాడ-గుంటూరు మధ్య ప్రాంతాల రైతులతో చర్చలు, ఒప్పందాలు చేసుకునేందుకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఆ ప్రాంతాల్లో మంత్రి వర్గ ఉపసంఘం పర్యటించనుందని తెలిపారు.
రైతులు ఆమోద సంకేతాలిస్తున్నారు..
నూటికి నూరు శాతం రైతులు ల్యాండ్ పూలింగ్ విధానానికి ఆమోదయోగ్యంగా ఉన్నారని, ఇప్పటికే వారు ప్రభుత్వానికి సంకేతాలు కూడా పం పుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఉత్తమ, అత్యద్భుత రాజధాని నిర్మాణానికి బెస్ట్ ఆర్కిటెక్చర్ కోసం ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతలు ‘మెకంజి’ కన్సల్టెన్సీకి అప్పగించేందుకు యోచిస్తున్నామని, ఇప్పటికే ఆ కన్సల్టెన్సీ కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు కూడా ఇచ్చిందన్నారు. రాజ దాని నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులు ఎవరైనా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో భూములు కొనుక్కున్నా, వారికి స్టాంప్ డ్యూటీ ఫీజు, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం హామీనిస్తుందన్నారు. హుదూద్ తుపానుపై మాట్లాడుతూ తుపాన్ ప్రభావం గురించి గంట గంటకు కేంద్రం తెలుసుకుంటోందన్నారు. తుపాన్ సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు మున్సిపల్ మంత్రి నారాయణను విశాఖపట్నం పంపించామన్నారు.
కేర్‌ఫుల్‌గా బ్రీఫింగ్ ఇవ్వు..
చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయం చాంబర్ నుంచి వెలుపలికి వచ్చిన మంత్రులు యనమల, పల్లె రఘునాథరెడ్డి, పి.నారాయణ ‘‘ల్యాండ్ పూలింగ్ మీద పెద్దగా చర్చించలేదని’’ పదే పదే చెప్పారు. కేవలం నాలుగు మాటలే సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్‌పై మాట్లాడారని మంత్రి నారాయణ విలేకరులతో పేర్కొన్నారు. కారు ఎక్కే ముందు యనమల.. సహచర మంత్రి పల్లెను పిలిచి ‘కేర్‌ఫుల్‌గా బ్రీఫింగ్’ ఇవ్వాలని సూచించి మరీ వెళ్లారు.