వేసవి శాపం | Fish Market Dull With Summer Effect in West Godavari | Sakshi
Sakshi News home page

వేసవి శాపం

Published Mon, Apr 15 2019 12:59 PM | Last Updated on Mon, Apr 15 2019 12:59 PM

Fish Market Dull With Summer Effect in West Godavari - Sakshi

భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో చేపల చెరువులో ఆయిల్‌ ఇంజిన్‌తో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న దృశ్యం

ఆక్వా హబ్‌గా పేరుగాంచిన భీమవరం పరిసరాల్లో చేపలసాగు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎండవేడిమికి చేపలు మృత్యువాతపడుతున్నాయి. దీంతో చెరువులలో చేపను రక్షించేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. ఇంజిన్‌ బోట్లు, ఏరియేటర్లు తిప్పుతున్నారు. కొన్నిచోట్ల ఆక్సిజన్‌ టాబ్లెట్లు వినియోగిస్తున్నారు. చేపలను బతికించుకునేందుకు రాత్రింబవళ్లు చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు.

పశ్చిమగోదావరి, భీమవరం అర్బన్‌: జిల్లాలో భీమవరం, ఉండి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో సుమారు 80 వేల హెక్టార్లలో చేపల చెరువులు ఉన్నాయి.  ముఖ్యంగా శీలావతి, కట్ల, ఫంగస్, రూప్‌చంద్, తిలాఫీ, గడ్డిచేప, చప్పనీటి చేపలను రైతులు పెంచుతున్నారు. ఈ ప్రాంతంనుంచి రోజుకు సుమారు వెయ్యి టన్నులకుపైగా చేపలు బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. రూ.కోట్లు విదేశీ మారకద్రవ్యం వస్తోంది. దీనికితోడు నష్టాలు తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు చేపలసాగుపై దృష్టిసారిస్తున్నారు.

ఎండవేడికి పెరుగుతున్న ఉప్పుశాతం
గతేడాది కంటే ఈ ఏడాది ముందే ఎండలు అదరగొడుతున్నాయి. మార్చి నుంచే వేసవి ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. దీంతో చెరువులలో నీరు ఇంకిపోతోంది. ఉప్పుశాతం పెరుగుతోంది. ఆక్సిజన్‌శాతంలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. దీంతో చేపలు చెరువు ఉపరితలంపైనే కొట్టుకుంటూ ఈదుతున్నాయి. ఫలితంగా తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం  తాటాకు, మొప్ప, పేను తెగుళ్లు విజృంభిస్తున్నాయి. వీటివల్ల చేపలు అధికసంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా ఉప్పుశాతం 4పైగా ఉంటే చేపల్లో ఎదుగుదల మందగిస్తుంది. ఒక్కోసారి హఠాత్తుగా చేపలు మృత్యువాత పడతాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కేజీ రూ.10!
వేసవి ఎండవేడిమి వల్ల చేపలు మృత్యువాత పడడంతో పట్టుబడికి రాకముందే చెరువులను ఖాళీ చేసి అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేజీ రూ.పదికి అమ్మిన ఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.  చేపల చెరువు రైతులు వారానికొకసారి నీటిని నింపడం వల్ల పీహెచ్, అమ్మోనియా, నైట్రేట్‌ తదితర క్షార గుణాలు అదుపులో ఉంటాయి. ఇటీవల చప్పనీరు లేకపోవడంతో నీటిలో ఉన్న  క్షారగుణాలలో మార్పులు వచ్చి చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకుని నష్టాలు పాలవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. 

మందగించిన చేప ఎదుగుదల
ఇటీవల పగలు ఎండ ఎక్కువగా కాస్తోంది. రాత్రుళ్లు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ఆక్సిజన్‌ శాతాలు పడిపోతున్నాయి. దీంతో ఉదయాన్నే చేపలు నీటి ఉపరితలంపై ఈదుతున్నాయని ఆక్వా రైతులు చెబుతున్నారు. చేపకు మేతగా పెట్టే డీఓపీ తవుడు కూడా తినడం లేదని ఆందోళన చెందతున్నారు. దీనివల్ల చేప ఎదుగుదల మందగిస్తోందని, దీనికితోడు తెగుళ్లు కుంగదీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. 

సన్న, చిన్నకారు రైతులు కుదేలు
చేపల పెంపకంపై ఆధారపడ్డ సన్నచిన్న కారు రైతులు కుదేలవుతున్నారు. ఎండల వల్ల చెరువులో నీటి వేడిమికి తట్టుకోలేక మృత్యుపడతున్నాయని దీంతో ఏటా తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీ పెట్టుబడులతో సాగు
ఒక ఎకరం చేపల సాగు చేసేందుకు సుమారు రూ. 2 లక్షల వరకు ఖర్చువుతోంది. చేపల సాగు చేయాలంటే 10 ఎకరాలుపైగా చెరువు ఉండాలని, చేపలకు మేతగా డీఓపీ తవుడు, చెక్క, పత్తిపిండి, పిల్లెట్స్‌ వేస్తుంటామని రైతులు చెబుతున్నారు. పెట్టే మేతను బట్టి 6 నుంచి 9 నెలల్లో కేజీ చేప తయారవుతుందని, చేప ఎదుగుదల మందగిస్తే చివరకు అప్పులు మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి
రాష్ట్రానికి ఏటా విదేశీ మారకద్రవ్యం సుమారు రూ.15 వేల కోట్లు తీసుకొస్తున్న చేపల సాగును సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. సాగుకు రుణాలు, మేత ధరలో సబ్సిడీ ఇవ్వడం లేదు. నష్టపోయినా పట్టించుకునే నాథుడు ఉండడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు రుణాలు అందించి ప్రోత్సహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

ఎండలు ఎక్కువగా ఉన్నాయి
నేను రెండెకరాల్లో చేపలు వేశా. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పట్టుబడికి రాక ముందే పట్టేశా. నష్టాలు వచ్చాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు.  
– వాటాల విజయకృష్ణ, ఆక్వా రైతు, నాగేంద్రపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement