‘కృష్ణ’లో అడుగు పెడితే తాటతీస్తాం
♦ కబ్జా రాయుళ్లకు మత్స్యకారుల హెచ్చరిక
♦ నదిలో ఆక్రమిత ప్రాంతంలో 250 బోట్లతో
♦ మూడు గంటలపాటు మహా ధర్నా
♦ ఐరన్ రోప్ తొలగించాలని డిమాండ్
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదీ గర్భాన్ని కొందరు పెద్దలు కబ్జా చేయడంపై మత్స్యకారులు నిప్పులు చెరిగారు. నది జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఆదివారం సుమారు 250 బోట్లలో వారు నదిలో కలియదిరుగుతూ మూడు గంటల పాటు వినూత్న రీతిలో మహాధర్నా చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో విస్తరించిన కృష్ణా నది గర్భాన్ని ప్రభుత్వ పెద్దలు కొందరు ఆక్రమించుకున్నారు. ఐరన్ రోప్‌లను నదిలోపల కంచెగా ఏర్పాటు చేసి వాటిపై ప్లాస్టిక్ డబ్బాలు, ఎర్రజెండాలు పాతి కబ్జా చేసేందుకు సిద్ధమ య్యారు. ఈ విషయాన్ని ‘కృష్ణమ్మ గర్భంలో పెద్దల కబ్జా’ శీర్షికన ఏప్రిల్ 28వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సాక్షి కథనంపై వివిధ వర్గాలకు చెందిన వారు, పలువురు నిపుణులు తీవ్రంగా స్పందించారు.
‘ప్రపం చంలోనే ఎక్కడా లేని విధంగా టీడీపీ నాయకులు ఇంతకు దిగజారారా?’ అంటూ ఆరా తీశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తుమ్మల పాలెం, గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం మధ్యలో కృష్ణానది గర్భంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణం మేర ‘పెద్దలు’ కబ్జా చేయడంపై మత్స్యకారులు తీవ్రంగా స్పందించారు. తుమ్మలపాలేనికి చెందిన మత్స్యకారులు ఆదివారం ఉదయం 9కి బోట్లలో కృష్ణానది ఆక్రమిత ప్రాంతా నికి చేరుకున్నారు. గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రా యునిపాలెం పరిధిలోని మత్స్యకారులూ అక్కడికి వచ్చారు.
నదిలో కలియదిరుగుతూ నిరసన
సుమారు 250 బోట్లలో 500 మందికిపైగా మత్స్యకారులు నదిలో ఆక్రమిత ప్రాంతం చుట్టూ తిరుగుతూ... ‘కృష్ణా నదిని కబ్జారాయుళ్ల నుంచి కాపాడండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కబ్జాకు పాల్పడిన పెద్దలపై విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి కొందరు బోట్లపై అర్ధనగ్నంగా నిల్చొని.. నదినే నమ్ముకుని బతుకుతున్న తమ పొట్టకొట్టొద్దంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు. కబ్జా ప్రయత్నాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. నదిలో ఏర్పాటు చేసిన భారీ ఐరన్ రోప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే తొలగించాల్సి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు, అధికారులను హెచ్చరించారు. మత్స్యకారుల ఆందోళన విషయం తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. కొందరు వ్యక్తులను ఆ ప్రాంతానికి పంపారు. వారు అక్కడికి వచ్చి ఆందోళనను సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తుండగా.. ఆందోళనకారులు నేరుగా వారి వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. కాగా, పెద్దల కబ్జా యత్నాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదేనా నదుల అనుసంధానం?
రైతులు, ప్రజల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు నదులు అను సంధానం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. నది ఉంటేనే కదా నదుల అనుసంధానం చేయటానికి? నదినే ఆక్రమించి కప్పెడితే నదుల అనుసంధానం లక్ష్యం ఎలా నెరవేరుతుంది?
– అబ్రహాం, మత్స్యకారుడు
నదిని పూడ్చేందుకు మిషన్లు తెచ్చారు
కృష్ణా నదిని ఆక్రమించి పూడ్చేందుకు కేరళ, కర్ణాటక, చెన్నై నుంచి పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చారు. ఈ విషయమై ‘సాక్షి’లో వార్త రావడంతో వాటిని నది లోపలికి తీసుకెళ్లలేదు. లేదంటే ఈ పాటికే పనులు ప్రారంభమయ్యేవి.
– విజయకుమార్, మత్స్యకారుడు
దుర్మార్గపు చర్య
టీడీపీ నేతలకు భూములు, కొండలు ఆక్రమించుకుంది చాల్లేదు. ఇసుక, మట్టినీ అమ్ముకున్నారు. అవీ చాలక ఏకంగా నదినే మింగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది. ఫలితం అనుభవించక తప్పదు.
– ఆంజనేయులు, మైలవరం సీపీఎం నియోజకవర్గ ఇన్‌చార్జి