అల్లూరు, న్యూస్‌లైన్: అడవి పండింది..కాకుల పాలైంది..అనే సామెతలా తయారైంది అల్లూరు చెరువులో చేపలు పట్టే వ్యవహారం. ఎవరికి దొరికిన చేప వాళ్లు ఎత్తుకెళుతుండటంతో నెల రోజులుగా సుమారు రూ.1.50 కోట్ల విలువైన చేపలు పరులపాలవుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయాక అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. అయినా ఏ దారిన వెళ్లే చేపలు ఆ దారిన గట్టు దాటేస్తున్నాయి. సుమారు 2,100 ఎకరాల్లో అల్లూరు చెరువు విస్తరించి ఉంది.
అందులో 500 ఎకరాలు ఆక్రమణకు గురికాగా మిగిలిన 1,600 ఎకరాల్లో సాగునీటి నిల్వ ఉంటుంది. వరుసగా తొమ్మిదేళ్ల పాటు ఈ చెరువు ఆయకట్టులో ఎడగారు సాగు జరగడంతో చేపలు పట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ తొమ్మిదేళ్లలో చేపలు ఒక్కోటి 10 నుంచి 20 కేజీల వరకు పెరిగాయి. గతంలో విడవలూరు మండలం పొన్నపూడి సొసైటీకి మత్స్యకారులు ఈ చెరువులో చేపలు పట్టుకునేవారు. పెద్దల కాలంలోనే జమీందార్లు వారికి ఈ అవకాశం కల్పించారు. అల్లూరు చుట్టుపక్కల ఉన్న వారికి అవకాశం లేకుండా, ఎక్కడో దూరంగా ఉన్న వారు చేపలు పట్టుకుంటుండటంపై అసంతృప్తి వెల్లువెత్తింది.
అల్లూరుకు చెందిన ఇరువర్గాల వారు చెరువుపై హక్కు తమదంటే తమదంటూ ఏడాది క్రితం కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాలకు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. కోర్టులో విచారణ సాగుతుండగానే రెండు వర్గాల వారు చెరువును పంచేసుకున్నారు. ఆరు నెలలుగా చెరోవైపు గుడిసెలు వేసుకుని రాత్రివేళలో చేపలు వేట సాగిస్తూ చేతి నిండా సంపాదిస్తున్నారు. ఉన్నతాధికారులు అటువైపు రాకుండా చేతులు తడిపే వారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జూలై 7, 8, 9 తేదీల్లో అల్లూరు ప్రాంతానికి చెందిన అన్ని కాలనీల వారు, అన్ని వర్గాల ప్రజలు చెరువులో చేపలు పట్టుకున్నారు. మరోవైపు అల్లూరు చెరువులో భారీ సైజు చేపలు ఉన్న విషయం తెలుసుకున్న ఇస్కపల్లి మత్స్య కారులు సముద్రంలో వేటసాగించే వలలతో ఇక్కడ చేపలు పట్టేశారు.
అనంతరం రంగంలోకి దిగిన మత్స్యశాఖాధికారులు అల్లూరు పోలీసుల సాయం తో అందరి వద్ద వలలు స్వాధీనం చేసుకున్నారు. చెరువులో ఎవరూ దిగరాదంటూ, దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కొద్దిరోజుల పాటు చేపల వేట తాత్కాలికంగా ఆగినా సోమ, మంగళవారాల్లో మళ్లీ ఊపందుకుంది. అధికారులు ఓవైపు పడవల్లో తిరుగుతూ తరుముతున్నా చేపలు పట్టే వాళ్లు తమ పని కానించేస్తున్నారు. ఇప్పటికే దాదాపు కోటి రూపాయల విలువైన చేపలు పరులపాలయినట్టు ప్రచారం జరుగుతోంది. అధికారులు మొదటి నుంచి పకడ్బందీగా వ్యవహరించి ఉంటే పంచాయతీకి సుమారు రూ.75 లక్షల ఆదాయం వచ్చి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు.
చేపలు గుటకాయ స్వాహా !
Published Sat, Aug 10 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement