గంగపుత్రుల గోడు వినిపింఛనే లేదు..! | Fishermens Sufering in West Godavari | Sakshi
Sakshi News home page

గంగపుత్రుల గోడు వినిపింఛనే లేదు..!

Published Fri, Feb 8 2019 7:35 AM | Last Updated on Fri, Feb 8 2019 7:35 AM

Fishermens Sufering in West Godavari - Sakshi

సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారులు

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు కొల్లాటి సీతారాముడు. మత్స్యకారుడు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన ఇతను 30 ఏళ్ల నుంచి సముద్రంలో వేట సాగిస్తున్నాడు. గతేడాది  వేటాడే మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండితే రూ.2వేలు పింఛన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సంబరపడ్డాడు. ఇప్పటికి రెండుసార్లు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇతని భార్య, కుమారుడు కూడా ఉప్పుటేరులో వేటాడి జీవనం సాగిస్తారు. మత్స్యకార సొసైటీలో వీరంతా సభ్యులు కూడా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతనికి పింఛన్‌ రావాలి. కానీ ఇంతవరకూ మంజూరు కాలేదు. మత్స్యశాఖ అధికారులు కానీ, సొసైటీ పెద్దలు కానీ సమాధానం చెప్పడంలేదు.

పశ్చిమగోదావరి, నరసాపురం, మొగల్తూరు:  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమంపై అనేక హామీలు గుప్పించారు. అందులో వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండితే రూ. 2 వేలు పింఛన్‌ అందిస్తామన్నది ప్రధానమైనది. అయితే ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఏమీ పట్టించుకోని తెలుగుదేశం సర్కారు 2018 నవంబర్‌ నుంచి గంగపుత్రులకు పింఛన్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయినా అర్హులకు సక్రమంగా అందడం లేదు. జిల్లాలో వేటపై ఆధారపడి జీవిస్తున్న వారిలో మూడోవంతు మందికి కూడా పింఛన్లు ఇవ్వడంలేదు.  జిల్లాలో ఒక్క నరసాపురంలోనే వేట సాగించే మత్స్యకార కుటుంబాలు 5వేల వరకూ ఉంటాయి. ఇక్కడ 1,280 మందికి మాత్రమేఅందిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని అర్హతలు ఉన్నా.. దరఖాస్తులను తిరస్కరించడంతో గంగపుత్రులు ఆవేదన చెందుతున్నారు. పని మానుకుని మత్స్యశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వృద్ధాప్య, వింతంతు వంటి సామాజిక పింఛన్లను ఇటీవల రెట్టింపు చేసిన చంద్రబాబు, మత్స్యకారులపై మాత్రం కరుణ చూపలేదు. సవాలక్ష ఆంక్షలతో దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు.

అవగాహన కరువే
అసలు ఈ పథకం ఒకటి ఉందని చాలామంది మత్స్యకారులకు తెలీదు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. 

ఎగ్గొట్టేందుకే వ్యూహం
సముద్రం, నదులు, ఉప్పుటేర్లలో ఎక్కడైనా సరే వేట సాగించేవారికి 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికే ఒంట్లో సత్తువ సన్నగిల్లుతుంది. అపార కష్టంతో కూడుకున్న పని వేట. దీంతో మత్స్యకారుల్లో  త్వరగా వృద్ధాప్య ఛాయలు అలముకుంటాయి. దీంతో 50 ఏళ్లు దాటిన గంగపుత్రులకు పింఛన్లు అందించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2018 నవంబర్‌ నుంచి దీనిని అమల్లోకి తెచ్చింది.
అయితే దీనికి సవాలక్ష ఆంక్షలు పెట్టింది. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పింఛన్‌దారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుడు సముద్రం, నదులు, ఉప్పుటేరుల్లో కచ్చితంగా వేట సాగించాలి, ఏదైనా గుర్తింపు పొందిన మత్స్యకార సొసైటీలో సభ్యుడై ఉండాలి. ఈ ఆంక్షల వెనుక లబ్ధిదారులను తగ్గించాలనే వ్యూహం కనబడుతోంది.  90శాతం గంగపుత్రులు పూర్తిగా నిరక్షరాస్యులు వీరికి వేట తప్ప మరోటి తెలీదు. సొసైటీలో సభ్వత్వం ఉండదు. కొంతమందికి సభ్యత్వం ఉంటుంది కానీ, ఆ విషయం వారికే తెలియదు. వారి పేరుతో సొసైటీలో రుణాలు వంటివి, కొందరు మత్స్యకారనేతలు, దళారులు మేసేస్తూ ఉంటారు. ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా వీరిలో అవగాహన కల్పించాలి. అయితే ఇలాంటి ప్రయత్నం సర్కారు చేయడం లేదు. పైగా పింఛన్‌కు ప్రజాసాధికార సర్వే మెలిక పెట్టడంతో చాలామంది అనర్హులవుతున్నారు. ఆ సర్వే తప్పుల తడకగా జరగడమే కారణం. 

జిల్లాలో 4,500 మందికే
జిల్లాలో 3.13 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వేట జీవనాధారం చేసుకుని జీవించే వారి సంఖ్య సుమారుగా 80వేలు ఉంటుందని అంచనా. అంటే దాదాపు 15వేల కుటుంబాలుపైనే ఉంటాయి. 19 కిలోమీటర్లు మేర తీరప్రాంతం ఉన్న నరసాపురంలోనే వేటపై ఆధారపడి జీవించే కుటుంబాల సంఖ్య 5వేల పైనే ఉంటుంది. కానీ నరసాపురం మండలంలో 600 మందికి, మొగల్తూరు మండలంలో 680 మందికి మొత్తం కలిపి నియోజకవర్గంలో 1,280 మందికి పింఛన్‌లు ఇస్తున్నారు.  ఇక జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో, ఉప్పుటేరుల్లో పెద్దసంఖ్యలో సంప్రదాయ వేట ఆధారంగా వేల కుటంబాలు జీవిస్తున్నాయి.  
కానీ 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు జిల్లాలో 4,500 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. ప్రధానంగా వేట సాగించే వారిలో ఎక్కువ మంది 40–55 సంవత్సరాల మధ్య వయస్సువారే 80 శాతం ఉంటారు. అంటే దాదాపుగా మూడొంతుల మందికి పింఛన్లు అందడంలేదన్నమాట. ఈ పింఛన్ల వయో పరిమితిని కూడా 50 నుంచి 64 ఏళ్ల వరకూ మాత్రమే పెట్టారు. 64 ఏళ్లు దాటిన మత్స్యకారులు వృద్ధాప్య పింఛన్‌దారుల జాబితాలోకి వెళ్తారు. అంటే జీవితమంతా సముద్రపు ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే చేపల వేటదారుడికి సర్కారు అందించే అదనపు ప్రయోజనం ఏమీ
లేదన్నమాట.  

ఈ పేద మత్స్యకారుడుఅనర్హుడంట!
నరసాపురం మండలం ఎల్‌బీచర్ల గ్రామానికి చెందిన  సంగాని వెంకటేశ్వర్లుది మరో దీనగా«థ. 63 ఏళ్ల వెంకటేశ్వరరావు ఊహతెలిసినప్పటి నుంచే సముద్రంలో వేట సాగిస్తున్నాడు.  మత్స్యకార పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈయనను అనర్హుడంటూ అధికారులు పేర్కొన్నారు. ప్రజా సాధికార సర్వేలో అతని పేరున  ట్రాక్టర్, కారు ఉన్నట్లు చూపుతుందట. ఉంటడానికి కనీసం ఇల్లు కూడాలేని తనకు కారు, ట్రాక్టర్‌ ఎక్కడివని వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తున్నాడు. తాను చిన్ననాటినుంచి మోచేతివల (ఇసురువల)తో వేటాడుతుండేవాడినని, ప్రస్తుతం కొంత కాలం నుంచి సముద్రంలో వేటకు వెళ్లడం లేదని చెబుతున్నాడు.  మత్స్యకార సొసైటీల్లో టీడీపీ వర్గంవారు చేసిన అన్యాయంతోనే తనకు పింఛన్‌ దక్కడం లేదనేది వెంకటేశ్వర్లు వాదన. అంటే ఇక్కడ కూడా ఒకరకంగా జన్మభూమి కమిటీల తరహా అన్యాయం అన్నమాట. ఇక జనవరిలో జరిగిన జన్మభూమి సభల తరువాత కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా లేకుండా, ఆన్‌లైన్‌లో తొలగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement