‘ఉండి’ టీడీపీలో ప్రకంపనలు.. రగులుతున్న అసమ్మతి సెగలు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఉండి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. భీమవరం పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై తెలుగుదేశం నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం వద్ద నుంచి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ నాయకులు.. సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటు మంతెన రామరాజుకే ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సెట్టింగ్ సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో రామరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సంకట స్థితిలో పడింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇప్పుడు రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారన్న సమాచారంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి.
రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించకపోయినా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. అందరూ సహకరిస్తే ఇండిపెండెంట్‌గా తాను బరిలో ఉంటానని మరోవైపు రామరాజు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి కూటమి చేతిలో భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ హామీ రావడంతో రామరాజు వర్గం తేరుకోలేకపోతోంది.
చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం ఐదు రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో రామరాజుకు ఎలాంటి హామీ రాకపోవడంతో కంటితడి కూడా పెట్టారు. ఆయన వర్గీయులు బుధవారం నుంచి ఆమరణదీక్ష ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment