- ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
- కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడిందెవరు? మీరు కాదా?
- అది మరిచి మాపై అభాండాలా?
- ఒక్కటంటే ఒక్కటైనా ఇల్లు కట్టారా?
- ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
- మేము వైఎస్ వారసులమేగానీ కాంగ్రెస్ వారసులం కాదు..
- ఇందిరా ఆవాస్ యోజన ఇళ్లపై సభలో దుమారం
- విపక్షం ప్రశ్నకు బదులివ్వకుండా అధికారపక్షం ఎదురుదాడి
- గృహనిర్మాణశాఖ మంత్రికి వత్తాసుగా రంగంలోకి ఇతరులు..
- హౌస్ కమిటీ వేద్దామంటూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదన
- కాలయాపన కోసమే ఈ ఎత్తుగడన్న విపక్షం
- ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై అవాకులు చవాకులు పేలడం మానాలన్నారు. తాము దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులమే తప్ప కాంగ్రెస్‌కు కాదని తేల్చిచెప్పారు. టీడీపీయే అసలు సిసలైన ‘తెలుగు కాంగ్రెస్’ అని అభివర్ణించారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ల మంజూరుపై చర్చలో తీవ్ర గందరగోళం జరిగింది. వాగ్వాదాలతో మొదలైన చర్చ సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసి.. చివరకు వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌తో ముగిసింది. అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి బదులు మంత్రులు ఎదురుదాడికి దిగి.. ప్రశ్నతో సంబంధం లేని అంశాల్ని ప్రస్తావించి చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు.
అడిగిన ప్రశ్న ఇది!
ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద గత పదినెలల కాలంలో ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు, ఎన్ని కట్టారు, ఎంతమందికి బిల్లులిచ్చారు, కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? ఖర్చు పెట్టినవి ఎన్ని? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి గృహనిర్మాణ మంత్రి మృణాళిని సూటిగా జవాబు చెప్పలేకపోయారు. ఐఏవై, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు 3,895 ఇళ్లు మంజూరు చేయమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, వాటిల్లో అగ్నిప్రమాద బాధితులకు సంబంధించినవి 3,275 ఉన్నాయంటూ గత పదేళ్లలో ఏమి జరిగిందంటే అని మొదలుపెట్టారు. దీంతో గోవర్దన్‌రెడ్డి మళ్లీ స్పష్టంగా తన ప్రశ్నను సంధించారు. దీంతో ఆత్మరక్షణలో పడిన మంత్రి మృణాళిని... పథకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ పథకంతో కలపడం వల్ల ఏమీ చేయలేకపోతున్నామని, నూతన మార్గదర్శకాలు తయారవుతున్నాయని చెప్పి కూర్చున్నారు.
మంత్రి మృణాళినికి వత్తాసుగా మరికొందరు...
మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు కాకాని, రోజా తదితరులు సూటిగా జవాబు చెప్పాలని పట్టుబట్టారు. ఈ దశలో గృహనిర్మాణ మంత్రికి మద్దతుగా మరో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోబోగా.. విపక్ష సభ్యులు అభ్యంతరపెట్టారు. అయినా అచ్చెన్నాయుడు, ఆ తర్వాత గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడారు. దీంతో విపక్ష, పాలకపక్ష సభ్యులమధ్య వాగ్వాదం జరిగింది. వంద జన్మలెత్తినా వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా రాష్ట్ర ప్రజల్ని మెప్పించడం టీడీపీ వల్ల కాదని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ఈలోగా మరో మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేయడంతో విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు.
తెలుగు కాంగ్రెస్ మీదే కదా?: జగన్
‘‘హౌసింగ్ సమస్య చాలా ముఖ్యమైంది. ఎన్నికలై పది నెలలైంది. ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఇల్లయినా నిర్మించిందా? కొత్తది ఒక్కటీ ఇవ్వకపోగా మంజూరైన వాటిని రద్దు చేశారు. పని మొదలైన తర్వాత కూడా నిధులు ఆపారు. మీరు ఈ ఏడాదిలో ఏం చేశారో చెప్పమంటే గత పదేళ్లలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అది చేసింది, ఇది చేసిందీ, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ అభాండాలు వేస్తున్నారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న తెలుగుదేశం వాళ్లే కదా కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ను కాపాడింది? అసలు సిసలైన తెలుగు కాంగ్రెస్ మీది కాదా? 294 మంది సభ్యులున్న ఇదే అసెంబ్లీలో రూ.32 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపిన కిరణ్ సర్కార్‌ను గద్దె దించడానికి బదులు విప్ జారీ చేసి మరీ పడిపోకుండా కాపాడారు. మెజారిటీకి 2 ఓట్లు తక్కువగా ఉంటే కాపాడింది ఎవరు? మీరు కాదా? తెలుగు కాంగ్రెస్ మీదయితే మమ్మల్ని అంటారా? వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆయన తన ఐదేళ్ల పాలనలో 48 లక్షల ఇళ్లు కట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. దేశం మొత్తం మీద కట్టిన ఇళ్లే 47 లక్షలు. కానీ వైఎస్ కట్టించింది 48 లక్షల ఇళ్లు. స్పీకర్‌గారు కూడా తన నియోజకవర్గంలో ఇళ్లు కట్టలేని పరిస్థితి. ఒక్కసారి నియోజకవర్గానికి వెళ్లండి. పేదలగోడు వినండి. అందరికీ అవసరమే ఇది’’ అని జగన్ నిప్పులు చెరిగారు.
హౌస్ కమిటీ వేద్దామా?
ఈ దశలో అచ్చెన్నాయుడు మళ్లీ మాట్లాడుతూ.. విపక్షాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ గత పదేళ్ల చరిత్రను ఏకరువు పెట్టారు. ఈ వ్యవహారమై విపక్షానికి చిత్తశుద్ధి ఉంటే సభా సంఘాన్ని(హౌస్ కమిటీ) వేద్దాం, కలిసి రండన్నారు. దీనికి రోజా అభ్యంతరం తెలుపుతూ మంత్రి పదవి ఓ మహిళకిచ్చి.. ప్రతిదానికీ అచ్చెన్నాయుడొక్కరే తెలివైన వాడినని, మిగతావాళ్లకు బుర్రలేదనుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై స్పీకర్.. బాధ్యతలేని వ్యాఖ్యలు చేయవద్దంటూ రోజాకు సూచించారు.
ఇంకో ఏడాది కాలయాపన కోసమా?: జగన్
తర్వాత జగన్ మాట్లాడుతూ... ‘‘ఒక్క ఇల్లూ లేదు, బిల్లూ లేదు. ఏడాది గడిచింది. హౌస్ కమిటీ పేరిట ఇంకో ఏడాది గడపాలన్నది పాలకపక్షం ఆలోచనగా ఉంది. ఓ పక్క కమిటీ అంటారు, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ మంత్రిగా పనిచేసిన శిల్పామోహన్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇస్తారు.. కిరణ్ సర్కార్ కూలకుండా మద్దతు తెలుపుతారు. మీకో విషయాన్ని స్పష్టం చేస్తున్నా.. మేము వైఎస్‌కు వారసులమేగానీ కాంగ్రెస్‌కు కాదు.. మానవత్వంతో మెలగండి, పేదల ఇళ్ల నిర్మాణానికి ముందుకు రండి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం.. అని ప్రకటించారు.
రెచ్చిపోయిన మంత్రులు: అనంతరం మాట్లాడిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల రామ కృష్ణుడు, రావెల కిషోర్‌బాబు, కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి, మృణాళిని, ఎమ్మెల్యేలు గౌతు శివాజీ తదితరులు వైఎస్సార్‌సీపీపైన, జగన్‌మోహన్‌రెడ్డిపైన తీవ్రవ్యాఖ్యలు చేశారు. చివరిగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు మంత్రే స్వయంగా అంగీకరించినందున సభా సంఘాన్ని వేసుకోమని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నానన్నారు.