'లక్ష'ణంగా గగనయానం | Flight Journey Passengers Rise From YSR Kadapa | Sakshi
Sakshi News home page

'లక్ష'ణంగా గగనయానం

Published Wed, Feb 19 2020 12:42 PM | Last Updated on Wed, Feb 19 2020 12:42 PM

Flight Journey Passengers Rise From YSR  Kadapa - Sakshi

సాక్షి కడప : ఒకప్పుడు విమానయానమంటే సంపన్నులకే సాధ్యం. నేడు మధ్యతరగతి వారు కూడా విమాన ప్రయాణం బాట పడుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న నగరాలను కలుపుతూ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ప్రారంభించిన ఉడాన్‌ పథకం కూడా విమాన ప్రయాణికుల సంఖ్య పెంచింది. తక్కువ మొత్తానికే గమ్యం చేర్చే సర్వీసులను ప్రారంభించడంతో విమానాశ్రయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. రీజినల్‌ కనెక్టివిటీ స్కీం ద్వారా ఇప్పుడు కడప నుంచి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులుండటంతో అన్ని ప్రాంతాలకు జిల్లా ప్రజలు విమానాలలో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడ లాంటి ప్రధాన నగరాలకు సర్వీసులను నడుపుతుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంపూర్తి కాకమునుపే ప్రయాణికుల సంఖ్య మరో మూడు, నాలుగు రోజుల్లో లక్ష చేరుకోనుండటమే ఇందుకు నిదర్శనం.

ఉడాన్‌ పథకంతో సామాన్యునికి..
కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకాన్ని అమలులోకి తీసుకు రావడంతో మధ్య తరగతి వర్గాల వారు కూడా విమానయానానికి మొగ్గు చూపుతున్నారు.  రెండో ముంబయిగా పేరొందిన ప్రొద్దుటూరు నుంచి బంగారు, ఇతర వ్యాపారాల నిమిత్తం రోజూ వ్యాపార వర్గాలు ప్రయాణాలు సాగిస్తుంటారు. కడప నుంచి విజయవాడ, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు విమానంలోనే ప్రయాణిస్తున్నారు.  ఉడాన్‌ పథకం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ విమానాలు తిరుగుతున్నాయి. ఈ స్కీమ్‌ ద్వారా విమానంలో సీటింగ్‌ కెపాసిటీకి సంబంధించి ప్రయాణీకులు లేకపోయినా.... కేంద్ర ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. విమాన సంస్థలపై భారం పడకుండా కేంద్రం ఉడాన్‌ స్కీమ్‌ ద్వారా భరిస్తుండడంతోపాటు సామాన్యులకు కూడా టిక్కెట్‌ధరలు అందుబాటులో ఉండేలా చూసుకుంటోంది. 

‘సీమ’కు కేంద్రంగా కడప ఎయిర్‌పోర్టు
జిల్లా కేంద్రమైన కడపలోని ఎయిర్‌పోర్టు రాయలసీమ జిల్లాలకు కేంద్రంగా ఉంది.  అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, ఇతర వ్యాపారవేత్తలు, అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారు కడప ఎయిర్‌పోర్టుకు వచ్చి విమానంలో రాకపోకలు సాగిస్తున్నారు. చిత్తూరుజిల్లాకు సంబంధించి రేణిగుంటలో ఎయిర్‌పోర్టు ఉండడంతో ఆ జిల్లా వారు అక్కడి నుంచే విమానయానం సాగిస్తుండగా, మిగిలిన మూడు జిల్లాలకు సంబంధించిన చాలామంది కడప ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాదు, విజయవాడ, చెన్నై నగరాలకు విమానయానం చేస్తున్నారు.  2017లో 40,491 మందికి పైగా ప్రయాణించారు. 2018లో 1,12,548 మంది గమ్యస్థానాలకు చేరారు. సుమారు  40రోజుల్లో ముగియనున్న ఈ ఆర్ధిక సంవత్సరంలో  96,500 మంది రాకపోకలు సాగించారు. మార్చి నెలాఖరులోగా మరికొన్ని వేల మంది ప్రయాణం సాగించేందుకు అవకాశం ఉండటంతో సంఖ్య లక్షకు చేరడం నిస్సందేహం.

వీఐపీల రాకతో కళకళ
2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన విమాన సర్వీస్‌లకు రోజుకురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అంతకుమునుపు బస్సులు, ప్రత్యేక వాహనాలు, రైళ్లకే పరిమితమయ్యేవారు. జిల్లా వాసులు చదువు, ఉపాధి, పర్యాటక ప్రాంతాల సందర్శనతోపాటు వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారికి కడప ఎయిర్‌పోర్టు నుంచి విమానం ద్వారా ప్రయాణించేందుకు  అనుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మన జిల్లాకు చెందిన వారు కావడంతోపాటు  కడప నుంచి తిరిగే విమానాలకు డిమాండ్‌ ఏర్పడింది. వీఐపీల తాకిడితో  ఎయిర్‌పోర్టు కళకళలాడుతోంది.

లక్ష మంది ప్రయాణించడం ఆనందంగా ఉంది
కడప నుంచి రోజూ హైదరాబాదు, విజయవాడ, చెన్నైలకు మూడు సర్వీసులు నడుస్తున్నాయి.  మార్చి 1 నుంచి మరో సర్వీసు బెల్గాంకు ప్రారంభం కానుంది. కడప నుంచి ఇతర నగరాలకు విమానంలో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. రానున్న కాలంలో నైట్‌ ల్యాండింగ్‌ కూడా వస్తే ఎయిర్‌పోర్టు మరింత అభివృద్ధిచెందుతుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టును పూర్తి స్థాయిలో అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం.
– పూసర్ల శివప్రసాద్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement