దుర్గగుడి ఫ్లైఓవర్
పుష్కరాలకు పూర్తి 2016 ఆగస్టు 23 నుంచి కృష్ణా పుష్కరాలు
జూలై 2016 నాటికి నిర్మాణం చెయ్యాలి
కలెక్టర్ బాబు.ఎ
భవానీపురం : దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చెయ్యాలని కలెక్టర్ బాబు.ఎ సమన్వయ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25,26 తేదీల్లో రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో ఫ్లైఓవర్ నిర్మాణంపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలోగా సంబంధిత సమన్వయ శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికలు, అంచనాలతో సిద్ధంగా ఉండాలని కోరారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఫ్లైఓవర్ పనులపై బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యం, వెనుకబాటుతనం చూపకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా పూర్తి చెయ్యాలని సూచిం చారు. 56 పిల్లర్లతో 1.5 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని వివరిం చారు. ఫ్లైఓవర్‌పై ఆరు మార్గాలు, దిగువున 4 మార్గాల రోడ్డుతో అనుసంధానం చేస్తూ 10లైన్ల రోడ్ల నిర్మాణం చేపడ్తారని తెలిపారు. జూలై 2016 నాటికి ఫ్లైఓవర్ పనులను కచ్చితంగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, తహశీల్దార్ గురువారం నుంచి క్షేత్రస్థాయి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కన్సల్టెంట్ ఆధ్వర్యంలో స్ట్రక్చర్ల నిర్మాణల వివరాలను సేకరించి ఒక అంచనాకు వస్తారని, వాటిని ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పారు. పోలవరం కాలువ నిర్మాణానికి సంబంధించి కేవలం 16 రోజుల్లో రూ.460 కోట్ల మేర చెల్లింపులు జరపడం ప్రపంచ రికార్డుగా పేర్కొన్నారు. అదే విధానంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తి చెయ్యాలని కోరారు.
ట్రాఫిక్ మళ్లింపునకు ఇప్పటి నుంచే కార్యాచరణ
ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా నగరానికి వచ్చే ట్రాఫిక్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు. రాజధాని దృష్ట్యా రానున్న రోజుల్లో మరింత ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉన్నందున హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్లే భారీ వాహనాలు, ఇతర వాహనాలను ఇబ్రహీంపట్నం నుంచి మళ్లిం చాల్సి ఉంటుందన్నారు. చెన్నయ్ వైపు వెళ్లే వాహనాల మళ్లింపుపై కూడా మ్యాప్‌లను సిద్ధం చేయాలని పోలీస్ అధికారులకు సూచిం చారు. ఆయా మార్గాల్లో మరిన్ని ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలకు ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాలను వినియోగించుకునేలా రోడ్డు భవనాలు, మున్సిపాలిటీ, పోలీస్ అధికారులు సమన్వయంతో నివేదికలను రూపొం దించాలని సూచించారు. త్వరలోనే సంబంధిత ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు, యూనియన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారులను కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు.
ఆగస్టు 23, 2016 నుంచి కృష్ణా పుష్కరాలు
కృష్ణానదికి 2016 ఆగస్టు 23 నుంచి పుష్కరాలు నిర్వహించాల్సి ఉందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఈ సమావేశాన్నే పుష్కర మొదటి సమావేశంగా భావించి పనులను సమీక్షించుకోవాలని సంబంధిత అధికారులను సూచిం చారు. ఫ్లైఓవర్‌కు చెందిన 3ఏను ఈ వారం చివరి నాటికి ప్రకటన జారీ అయ్యేలా చూడాలని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చెయ్యాలన్నారు. ఈ నిర్మాణానికి 60 శాతం మేర భూసేకరణ అవసరం లేదని పేర్కొన్నారు. సమావేశంలో జేసీ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, ట్రైనీ కలెక్టర్ సలోని సుడాన్, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో నరసింగరావు, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్ అధికారులు, యూఎస్‌ఏ కన్సల్టెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.