ఇక ఉచితంగా ఇసుక
► అమ్మకాలు చేపడితే చర్యలు
► ఇసుక రీచుల్లో సూచిక బోర్డులు
► జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అర్బన్): ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. ఇంటి నిర్మాణదారులకే ఇసుక అందేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్‌లో ఇసుక రవాణాపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలన్నారు. అనుమతి పొందిన వాహనాల ద్వారానే ఇసుక రవాణా జరగాలన్నారు. అన్ని ఇసుక రీచుల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు.
అక్రమార్కులపై అవసరమైతే పీడీ చట్టాలను కూడా ప్రయోగించాలన్నారు. ఉచిత ఇసుక విధానంపై వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్, అదనపు ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి, మైన్స్ డీడీ పుల్లయ్య, ఏడీ కె. పూర్ణచంద్రరావు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీపీఓ శోభా స్వరూపరాణి, పీఆర్ ఎస్‌ఈ సురేంద్రనాథ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, ఆర్‌డీఓలు రఘుబాబు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణంలో వేగం పెంచండి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీటి సమస్య, ఎన్‌టీఆర్ భరోసా, 12 మండలాల్లోని చెంచు గూడేల్లో రేషన్‌కార్డులు, ఇంటి పట్టాలు, గృహ నిర్మాణాలు, అంగన్‌వాడీ పిల్లలు, అన్ని పాఠశాలల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తదితర ప్రధాన సమస్యలపై కలెక్టర్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 మండలాల్లోని చెంచు గూడేల్లో అవసరమైన రేషన్ కార్డులు, ఏఏవై కార్డులు, ఇంటి పట్టాలు, గృహ నిర్మాణాల మంజూరుకు అవసరమైన జాబితాలను సిద్ధం చేయాలన్నారు. మార్చి ఆఖరు కల్లా విద్యార్థుల ఆధార్ ఎన్‌రోల్ పూర్తి కావాలని ఐసీడీఎస్, విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, డీఆర్‌డీఏ పీడీ రామక్రిష్ణ, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఐసీడీఎస్ పీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు.