జయపురం(భువనేశ్వర్): వంతెన నిర్మించండి మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో చందాలు వేసుకుని మరీ వెదురు కర్రలు కొనుగోలు చేసుకున్నారు. మూడు రోజులు కష్టపడి కెరకొండ నదిపై కర్రల వంతెన నిర్మించుకున్నారు. బొరిగుమ్మ సమితిలోని డెంగాపొదర్ పంచాయతీ ప్రజలు చేపట్టిన ఈ పనిని చుట్టుపక్కల గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు.
వివరాలిలా ఉన్నాయి.. సరిగ్గా మూడేళ్ల క్రితం బిజూ పట్నాయక్ సేతు పథకంలో భాగంగా ఇక్కడి నదిపై శాశ్వత వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటివరకు ఆ నిర్మాణంలో కనీసం 10 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఇదే వంతెనపై ఆధారపడిన పంచాయతీలోని డెంగాపొదర్, కెరకొండ, చత్రల, చంపియా, పొడయిగుడ, పకనగుడ, పరసొల, నాగజొడి, బిజాగుడ, అంవులి వంటి దాదాపు 15 గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం నది నీటిలో ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే సమస్య పరిష్కారానికి అధికారులు, నేతల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇలా అందరూ కలిసి, వెదురు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. దీంతో తమ కష్టాలు కొంతవరకు అయినా తీరాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Rescued Pregnant Cat: పిల్లిని కాపాడినందుకు రూ.10 లక్షల రివార్డు !
Comments
Please login to add a commentAdd a comment