తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలి
► ప్రజలకు సమస్య రాకుండా
► చర్యలు తీసుకోవాలి
► అధికారులు, ఉద్యోగులుసేవాదృక్పథంతో పనిచేయాలి
► సమీక్షించిన కలెక్టర్ టీకే శ్రీదేవి
పాలమూరు : వేసవిలో జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బం దులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. గురువారం ఆమె గ్రామీణ తాగునీటి సరఫరా ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. మనిషికి గాలి తర్వాత తాగునీరు అత్యంత అవసరమని, తాగునీరు అందించే అధికారులు, సిబ్బంది వారు చేసే పనిని అదృష్టంగా భావించాలని అన్నారు. ముఖ్యంగా పాలమూరు ప్రజల కోసం పనిచేయడం వరంగా భావించాలని, సేవా దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా ప్రజలకు తాగునీరు అందించడం జరిగిందని, కరువు వల్ల ప్రస్తుతం తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, ఈ సంవత్సరం వర్షపాతం సుమారు 40 శాతం తక్కువగా ఉందని, అందువల్ల తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాగునీటి సరఫరా శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
తాగునీరు సరిగా లేకపోతే అనేక రోగాలు వచ్చే ఆస్కారం ఉందని, ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అందుకు గాను అందరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛభారత్ అమలు వంటివి ముఖ్యమని చెప్పారు. వీటన్నింటిలో ముందుండి చొరవ చూపిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.
అధికారులు తమ పనిగా భావించాలి
రాబోయే రెండు నెలల్లో ఎలాంటి వర్షాలకు అవకాశం లేదని, అందువల్ల ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా నిరంతరం కృషిచేయాలని ఆమె కోరారు. జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా అది మనదే అన్న భావన అధికారులు, సిబ్బందిలో కలిగినప్పు డు జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ తాగునీటి పరీక్ష ప్రయోగశాలను తనిఖీ చేశారు. నీటి నమూనాల పరిశీలన, ఫ్లో రైడ్ యంత్రాలు, కలుషితమైన తాగునీటిని గుర్తించే యంత్ర పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రసాద్‌రావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రామ్‌కోటారెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ చేస్తున్న కృషిని వివరించారు. జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ మాట్లాడు తూ ప్రజలు కోరుకున్న సౌకర్యాలను అందించడాన్ని కర్తవ్యంగా భావించి బాధ్యతతో ముందుకెళ్లాలని కోరా రు. కొత్తగా చార్‌జ తీసుకోనున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పద్మనాభరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు, ఈఈలు, ఏఈ లు, స్వచ్ఛభారత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.