సాక్షి, అమరావతి : గడిచిన నాలుగేళ్ల పారిశ్రామిక వృద్ధి రేటులో వ్యవసాయం.. దాని అనుబంధ రంగాలు కీలకపాత్ర పోషించాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దేశ సగటుతో పోలిస్తే తయారీ రంగం, సేవల రంగంలో వెనుకబడి ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం ఆదుకోవడంతో పారిశ్రామిక వృద్ధిరేటులో దేశ సగటు కంటే ముందంజలో నిలిచినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ప్రజావేదికలో పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్‌పై సోమవారం ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్‌డీపీలో 34.34 శాతం వ్యవసాయ రంగం నుంచి వస్తుంటే, తయారీ, సేవల రంగాల నుంచి తక్కువ ఉందన్నారు.
గడిచిన నాలుగేళ్లలో దేశ సగటు వృద్ధిరేటు 7.10 శాతంగా ఉంటే రాష్ట్రంలో 9.5 శాతంగా ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో భారీ వృద్ధి రేటు నమోదు కావడమేనన్నారు. నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో దేశ సగటు వృద్ధిరేటు రెండు శాతంలోపు ఉంటే అది మన రాష్ట్రంలో 10.5 శాతంగా ఉందని, ఇదే సమయంలో దేశ తయారీ రంగ వృద్ధిరేటు 8.43 శాతంగా ఉంటే రాష్ట్రంలో 14.35 శాతంగా నమోదయ్యిందన్నారు. ఇక రానున్న కాలంలో తయారీ, సేవా రంగాలపై అధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరగాలంటే వీరు తయారీ, సేవల రంగాల వైపు మారాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఐటీ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, నిర్మాణ, పర్యాటక రంగాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.
నన్ను చూసే పెట్టుబడులు వస్తున్నాయి
కేంద్రం చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్టును అమలుచేయకపోవడంతో తామే సొంతంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని, దుగరాజపట్నం బదులు రామాయపట్నంలో ఓడరేవులను, కాకినాడలో ప్రైవేటు సంస్థ హల్దియాతో పెట్రో కెమికల్ ఫ్యాక్టరినీ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. కాగా, పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుల ద్వారా మొత్తం 2,622 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.10.48 లక్షల పెట్టుబడులు, 32.33 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ఒప్పందాల్లో ఇప్పటివరకు 810 అమల్లోకి వచ్చాయని వీటివల్ల 2.51 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు. పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరిగానని, దీనికి నా వ్యక్తిగత క్రెడిబిలిటీ తోడుకావడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారన్నారు. కొత్త సంవత్సరంలో కుప్పం, దగదర్తి ఎయిర్‌పోర్టులకు, రామాయపట్నం ఓడరేవు, అక్కడ సమీపంలోనే కాగిత పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయన్నుట్లు తెలిపారు. అలాగే, కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో విమనాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేశారు.
తలాక్ బిల్లుకు వ్యతిరేకం
తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీనికోసం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడి పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ బిల్లును రాజ్యసభలో తీవ్రంగా వ్యతిరేకించాలని చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. ఈ విషయమై తాను ఇప్పటికే రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీతో మాట్లాడానని, విపక్ష పార్టీలన్నింటితో కలిసి సమన్వయంతో పనిచేయాలని వారికి చెప్పారు. మరోవైపు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసీఆర్‌తో రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ ప్రధానికి లేఖ రాయించి తీసుకువస్తే స్వాగతిస్తామన్నారు.
తయారీ, సేవల రంగంపై దృష్టి పెడతా
Published Tue, Jan 1 2019 4:48 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment