జానపద బృందం సభ్యులతో నిజాంగారి గోపాల్
కొలుములపల్లె (బేతంచెర్ల):వేలి వేలి ఉంగరాలు... నా స్వామి... ఎడమచేతి ఉంగరాలు ..నాస్వామి.. అంటూ అతను పాడుతుంటే ప్రేక్షకులు పాటలో లీనమై తమను తాము మరచిపోతారంటే అతిశయోక్తి కాదు. కాళ్లకు గజ్జెలు కట్టి చేతిలో అందెలు పట్టుకొని పాటకు అనుగుణంగా అతను వేసే చిందు అద్భుతం. అతని నోటి వెంట వచ్చే జానపదం విని.. పల్లెజనం శ్రమను మరచిపోయి.. ఆనందడోలికల్లో తేలియాడుతుంటారు. బేతంచెర్ల మండలం కొలుములపల్లె గ్రామానికి చెందిన నిజాంగారి గోపాల్ విజయగాథ ఇదీ..
జానపద కళాకారుడు నిజాంగారి గోపాల్ చిరుప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల గాన గంధర్వుడిగా, జానపద గాన కోకిలగా బిరుదులు అందుకున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక పదో తరగతిలోనే ఇతను చదువుకు స్వస్తి పలికాడు. చిరుప్రాయంలోనే తన మేనమామ కేశాలు ప్రోత్సాహంతో జానపద గేయాలు నేర్చుకున్నాడు. కొంతమంది దాతల సహకారంతో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పొల్గొని విజేతగా నిలిచాడు. మాటీవీ రేలా రే రేలా ప్రోగ్రాంలో పలు ఎపిసోడ్లలో ప్రతిభ కనబరిచి.. 2010 నవంబర్‌లో ఫైనల్ విన్నర్‌గా నిలిచాడు. నాపరాయికి ప్రసిద్ధి గాంచిన కొలుముల పల్లె పేరు రాష్ట్రస్థాయిలో పేరుమోగేలా చేశారు.
సినిమాల్లో పాటలు..
పల్లె గొంతుకు అయిన జానపదాన్ని రాష్ట్ర స్థాయిలో వినిపించిన ఘనత గోపాల్‌కే దక్కింది. ఇతని పాటలు.. జానపద కళాకారులను, సంగీత ప్రియులను సైతం మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఒంగోలు గిత్త సినిమాలోనూ ఒక జానపద గేయాన్ని ఆలపించాడు. జానపద కళాబృందం సభ్యులతో కలిసి ఇప్పట వరకు 300 ప్రదర్శనలు ఇచ్చారు. గోపాల్..తండ్రి ఓ సాధారణ రైతు. పేదరికం కారణంగా.. కొంత మంది దాతల సహకారంతో తాను నమ్ముకున్న రంగంలో రాణిస్తున్నాడు.
ఉత్సాహవంతులైన వారికి నేర్పిస్తున్నా
కళ మరుగున పడకుండా ఉత్సాహవంతులైన జానపదకాళాకారులను ప్రోత్సాహిస్తూ కొత్తబాణిలు నేర్పుతున్నాను. 15 నుంచి 35 సంవత్సరాలలోపు యువతి, యువకులను ప్రోత్సాహిస్తూ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో దాతలు ఆహ్వానం మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నాను. కొత్త వారితో జానపదాలు పాడిస్తున్నాను. జానపదం ప్రాచీన కళ. ఈ కళను మరుగున పడకుండా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. – నిజాంగారి గోపాల్
Comments
Please login to add a commentAdd a comment