ప్రమాదానికి కారణమైన కారు ఇదే
ప్రకాశం బ్యారేజీ (తాడేపల్లి రూరల్): విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 45వ ఖానా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పాదచారికి తీవ్ర గాయాలయ్యాయి. 100 కి.మీ.పైగా వేగంతో వెళ్తున్న కారు పాదచారిని ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడంతో బ్యారేజీపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు కారు నంబర్‌తో పాటు, కారుపై ఉన్న పేర్లను, ఎన్టీఆర్ బొమ్మను గుర్తించి గుంటూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉండవల్లి సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ బాలకృష్ణ కారు ఆపేందుకు ప్రయత్నించగా దారి మళ్లించి తాడేపల్లి రోడ్డులోకి కారు పోనిచ్చారు.
అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కారుకు అడ్డంగా నిల్చుని ఆపేశాడు. దీంతో కారు దిగిన యువకులు ఎందుకు ఆపారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఒక వ్యక్తి తమ కారు అద్దం తగిలి కిందపడ్డాడని, తమకు ఏం తెలియదంటూ సమాధానం ఇచ్చారు.
కాగా, ప్రమాదం జరిగిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ బాలకృష్ణ పట్టుకొన్న కారును తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. నిందితులు తాము టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులమని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరడానికి ప్రయత్నించగా చెప్పడానికి నిరాకరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment