నటన కోసం ఉద్యోగాన్ని వదులుకున్నా..
నటుడు రవికిరణ్
భీమవరం అర్బన్ : నటన అంటే తనకు చాలా ఇష్టమని.. నటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని అంటున్నారు సినీ, బుల్లితెర నటుడు (అష్టాచెమ్మా ఫేం) రవికిరణ్. భీమవరంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సినిమా, సీరియల్స్‌లో నటించే ముందు కథకు ప్రాధాన్యమిస్తానన్నారు. ఇప్పటి వరకు 15 సీరియల్స్‌లో నటించానని, ప్రస్తుతం దాసరి నారాయణరావు నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ సీరియల్‌లో నటిస్తున్నానని చెప్పారు. నటనలో మరింత రాణించేందుకు కొంతకాలం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందానన్నారు.
నిజం.. నిజం సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయ్యానని చెప్పారు. 2006లో నాగార్జున నిర్మించిన నువ్వు వస్తావని సీరియల్ తనకు మంచిపేరు తీసుకువచ్చిందని తెలిపారు. అమ్మమ్మ డాట్ కాం, అష్టాచెమ్మా, అభిషేకం, చిన్నకోడలు, లయ వంటి సీరియల్స్‌లో పాత్రలు పేరు తెచ్చిపెట్టాయన్నారు. జెనీలియా కథానాయికగా నటించిన ‘కథ’ సినిమాలో నెగెటివ్ పాత్ర పోషించి మెప్పించానని చెప్పారు. దర్శకత్వంలో మణిరత్నం, నటనలో చిరంజీవి అంటే ఇష్టమన్నారు. పేద కళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో త్వరలో ఓ సంఘాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. బుల్లితెరలోనైనా, సినిమాలోనైనా ప్రజలు మెచ్చే పాత్రలనే పోషిస్తానని అన్నారు.