తిరిగి పట్టు కోసం!
సీపీఐ మావోయిస్టు కేంద్ర మిలటరీ కమిటీ నేత నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న మన్యంలోకి వచ్చి వెళ్లిన తర్వాత మావోయిస్టుల్లో నూతనోత్తేజం కనబడుతోంది. ఏవోబీలో కోల్పోయిన పట్టుకోసం వారు తిరిగి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు రాష్ట్రాలకు కేంద్రంగా ఉన్న ఏవోబీలో పట్టుకోల్పోతే దండకారణ్యంపై దాని ప్రభావం పడుతుందని భావిస్తూ.. పెదబయలు ఏరియా కమిటీని మల్కజ్‌గిరి-విశాఖ-కోరాఫుట్(ఎంవీకే) డివిజన్‌లో విలీనం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర కమిటీకి చెందిన కీలక నేతలతో పాటు దండకారణ్యంనకు చెందిన కొందరు నేతలు ఈస్ట్ డివిజన్‌లో పర్యటించినట్టు వస్తున్న వార్తలు.. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే నెల నుంచి మావోయిస్టుల నిరసన వారాన్ని పాటించాలని పిలువునివ్వడంతో పోలీసులు అదనపు బ లగాలను మన్యంలోకి మోహరించారు.
- ఏవోబీలో మావోయిస్టుల యత్నాలు..
- ఈస్ట్ డివిజన్‌లో పర్యటించిన కీలక నేత..
- పెదబయలు ఏరియా కమిటీ ఎంవీకేలో విలీనం?
- జులై 1 నుంచి వారం పాటు నిరసన
- అప్రమత్తమైన పోలీసులు.. కూబింగ్ ఉధృతం
కొయ్యూరు : మిలటరీ వ్యూహాలు రచించడంలో దిట్టయిన నంబళ్ల కేశవరావు 40 రోజుల కిందట ఈస్ట్ డివిజన్‌లోకి అడుగుపెట్టారు. కొద్ది రోజులు ఆయన అక్కడే ఉన్నారు. అతను వస్తే ఏదో ఒక విధ్వంసానికి మావోయిస్టులు ఏదో ఓ వ్యూహాన్ని రచించి ఉంటారని పోలీసులు భావించి.. గడచిన కొన్ని రోజుల నుంచి విస్త ృతంగా బలగాలను మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అతనితో పాటు కేంద్ర రీజియన్ బ్యూరోకు చెందిన కటకం సుదర్శన్ కూడా ఈస్ట్ డివిజన్‌లోకి వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది.
వీరంతా ఏవోబీలో ఉన్న ఏరియా కమిటీలు, డివిజన్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళికలు, కొత్త వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. పెదబయలు ఇటు మల్కజ్‌గిరి అటు కోరాపుట్‌కు కీలకంగా మారడంతో దాని పేరిట ఉన్న ఏరియా కమిటీని ఎంవీకేలో విలీనం చేశారన్న వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజుల నుంచి ఏపీ పోలీసులు మావోయిస్టులపై పూర్తిస్థాయిలో నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. దీంతో మిలీషియా కమాండర్లు, సభ్యులు లొంగుబాట్లు పెరిగాయి. అలాగే ఈ నెల 20న పెదబయలు మండలంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో మావోయిస్టు నేత సూర్యం మరణించారు.
వేణు ఎవరన్న దానిపై ఆరా..
కొద్ది రోజుల కిందట మల్కన్‌గిరి-విశాఖ- కోరాపుట్ నేత వేణు పేరిట ఓ ప్రకటన విడుదల అయింది. దీంతో వేణు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పని చేసిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్.. వేణు అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పోలీసుల చర్యలను నిరసిస్తూ మావోయిస్టులు జులై ఒకటి నుంచి నిరసన వారాలు పాటించి ఆరు, ఏడున బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సమాచారంతో పోలీసులకు చేరడంతో అదనపు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. నర్సీపట్నం ఓఎస్‌డీ విశాల్ గున్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఎండకోట,గొందికోటలో కూడా పర్యటించి గిరిజనులతో ఇటీవల మాట్లాడారు. మావోయిస్టులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో పోలీసులున్నారు.