East Division
-
గిరిజనులే సమిథలు
పోలీసులు-మావోయిస్టుల పోరులో గిరిజనులే సమిథలవుతున్నారు. గొబ్బరిపాడు ఘటనే ఇందుకు తార్కాణం. మావోయిస్టులు అపహరించుకుపోయిన ఇద్దరిలో ఒకరిని కాల్చి చంపి, మరొకరిని తీవ్రంగా కొట్టి విడిచిపెట్టారు. మందుపాతర పేలినా.. ఎన్కౌంటర్ జరిగినా మొదట బలయ్యేది గిరిజనులే..చివరకు మావోయిస్టులకు భయపడి గ్రామాలను వదిలిపోతున్న దుస్థితి. ఒకప్పుడు మావోయిస్టుల సమాచారం చెప్పాలని గిరిజనుల ఇళ్లను పోలీసులు ధ్వంసం చేసేవారు. ఇప్పుడు ఆ పనిని మావోయిస్టులు చేస్తున్నారు. - గిరిజనుడ్ని కాల్చి చంపిన మావోయిస్టులు - ఎన్కౌంటర్ జరిగినా.. మందుపాతర పేలినా..మారుమూల ప్రాంతాల వారికి నరకం - వీరవరం సంఘటన నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న దళసభ్యులు కొయ్యూరు/ముంచంగిపుట్టు: ఈస్టు డివిజన్లో 1980 దశకంలో మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైననాటి నుంచి గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. మందుపాతరలు పేలిన సంఘటనలో ఎందరో గిరిజనులను పోలీసులు అరెస్టులు చేశారు. అప్పట్లో టాడా లేదా పోటా కింద జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గారు. అదే సమయంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటే దానికి పోలీసు ఇన్ఫార్మర్లే కారకులంటూ ఎక్కువ మందిని చంపారు. ఒక విధంగా చనిపోయిన మావోయిస్టుల కంటే వారి చేతిలో చంపబడిన గిరిజనులే అధికం. జూన్ 20న గబ్బురపాడులో జరిగిన ఎన్కౌంటర్లో సూర్యం అనే మావోయిస్టు మరణించాడు. దానికి ముంచంగిపుట్టు మండలం గొబ్బరిపాడు గ్రామస్తులే కారకులంటూ గ్రామంలోని జీనబంధు ఇంటిని శనివారం వేకువజామున పేల్చివేశారు. పాంగి రామన్న,లైకోన్ ఇళ్లను ధ్వంసం చేశారు. పాంగిరామన్న(28)ను తీసుకెళ్లి పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు కాల్చిచంపారు. దోబులును కొట్టి విడిచిపెట్టారు. దోబులు రాత్రి అంతా మృతదేహం వద్ద లేవలేని స్థితిలో ఉండిపోయాడు. సరిహద్దు ఒడిశా అర్లోయిపడా గ్రామస్తుల సమాచారంతో ఆదివారం కుటుంబ సభ్యులు వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చి ఉదయం పది గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.ప్రస్తుత పరిస్థితులతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొందరు గ్రామాలను వదిలిపోతున్నారు. మొదట బలయ్యేది గిరిజనులే.. రెండు దశాబ్దాల కిందటి వరకు పోలీసులను చూస్తే గిరిజనులు భయపడేవారు.. మావోయిస్టుల సమాచారం చెప్పాలని నానా విధాల చిత్రహింసలు పెట్టేవారు. కేసులు పెట్టి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గే విధంగా చేసేవారు. దాని మూలంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన పోలీసులు గిరిజనుల్లో మార్పును తీసుకురావడం ప్రారంభించారు. దీని కోసం ఎన్నో పథకాలను చేపట్టారు. సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. చివరకు ఉద్యోగాలకు అవసరమైన కేరీర్‌గెడైన్స్‌ను కూడా అందిస్తున్నారు. గతంలో మందుపాతర పేలుళ్లలో పోలీసులు మరణిస్తే అనుమానితులను ఇబ్బందులు పెట్టేవారు. కేసులు న మోదు చేసేవారు. ఎన్కౌంటర్లో ఎవరైనా మావోయిస్టులు మరణిస్తే దానికి కారణమైన వారిని తెలుసుకునేవారు. ఇన్ఫార్మర్లుగా వ్యవహరించవద్దని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించేవారు. ఇళ్లు ధ్వంసం చేయడం లాంటివాటికి పాల్పడేవారు కాదు. అయితే వీరవరం ఘటనలో శరత్,గణపతిలను గిరిజనులే చంపేయడాన్ని దళసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
తిరిగి పట్టు కోసం!
సీపీఐ మావోయిస్టు కేంద్ర మిలటరీ కమిటీ నేత నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న మన్యంలోకి వచ్చి వెళ్లిన తర్వాత మావోయిస్టుల్లో నూతనోత్తేజం కనబడుతోంది. ఏవోబీలో కోల్పోయిన పట్టుకోసం వారు తిరిగి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు రాష్ట్రాలకు కేంద్రంగా ఉన్న ఏవోబీలో పట్టుకోల్పోతే దండకారణ్యంపై దాని ప్రభావం పడుతుందని భావిస్తూ.. పెదబయలు ఏరియా కమిటీని మల్కజ్గిరి-విశాఖ-కోరాఫుట్(ఎంవీకే) డివిజన్లో విలీనం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర కమిటీకి చెందిన కీలక నేతలతో పాటు దండకారణ్యంనకు చెందిన కొందరు నేతలు ఈస్ట్ డివిజన్లో పర్యటించినట్టు వస్తున్న వార్తలు.. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే నెల నుంచి మావోయిస్టుల నిరసన వారాన్ని పాటించాలని పిలువునివ్వడంతో పోలీసులు అదనపు బ లగాలను మన్యంలోకి మోహరించారు. - ఏవోబీలో మావోయిస్టుల యత్నాలు.. - ఈస్ట్ డివిజన్లో పర్యటించిన కీలక నేత.. - పెదబయలు ఏరియా కమిటీ ఎంవీకేలో విలీనం? - జులై 1 నుంచి వారం పాటు నిరసన - అప్రమత్తమైన పోలీసులు.. కూబింగ్ ఉధృతం కొయ్యూరు : మిలటరీ వ్యూహాలు రచించడంలో దిట్టయిన నంబళ్ల కేశవరావు 40 రోజుల కిందట ఈస్ట్ డివిజన్‌లోకి అడుగుపెట్టారు. కొద్ది రోజులు ఆయన అక్కడే ఉన్నారు. అతను వస్తే ఏదో ఒక విధ్వంసానికి మావోయిస్టులు ఏదో ఓ వ్యూహాన్ని రచించి ఉంటారని పోలీసులు భావించి.. గడచిన కొన్ని రోజుల నుంచి విస్త ృతంగా బలగాలను మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అతనితో పాటు కేంద్ర రీజియన్ బ్యూరోకు చెందిన కటకం సుదర్శన్ కూడా ఈస్ట్ డివిజన్‌లోకి వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా ఏవోబీలో ఉన్న ఏరియా కమిటీలు, డివిజన్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళికలు, కొత్త వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. పెదబయలు ఇటు మల్కజ్గిరి అటు కోరాపుట్‌కు కీలకంగా మారడంతో దాని పేరిట ఉన్న ఏరియా కమిటీని ఎంవీకేలో విలీనం చేశారన్న వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజుల నుంచి ఏపీ పోలీసులు మావోయిస్టులపై పూర్తిస్థాయిలో నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. దీంతో మిలీషియా కమాండర్లు, సభ్యులు లొంగుబాట్లు పెరిగాయి. అలాగే ఈ నెల 20న పెదబయలు మండలంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత సూర్యం మరణించారు. వేణు ఎవరన్న దానిపై ఆరా.. కొద్ది రోజుల కిందట మల్కన్‌గిరి-విశాఖ- కోరాపుట్ నేత వేణు పేరిట ఓ ప్రకటన విడుదల అయింది. దీంతో వేణు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పని చేసిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్.. వేణు అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పోలీసుల చర్యలను నిరసిస్తూ మావోయిస్టులు జులై ఒకటి నుంచి నిరసన వారాలు పాటించి ఆరు, ఏడున బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సమాచారంతో పోలీసులకు చేరడంతో అదనపు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. నర్సీపట్నం ఓఎస్డీ విశాల్ గున్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఎండకోట,గొందికోటలో కూడా పర్యటించి గిరిజనులతో ఇటీవల మాట్లాడారు. మావోయిస్టులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో పోలీసులున్నారు. -
‘ఏవోభీ’తావహం
గూడెంకొత్తవీధి/పాడేరు,న్యూస్‌లైన్: ఒడిశా,ఛత్తీస్‌గఢ్ సంఘటనలతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని ఈస్ట్‌డివిజన్ అంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు అంతటా పోలీసు బలగాలు మోహరించాయి. ఎప్పుడే సంఘటన చోటుచేసుకుంటుందోనన్న ఆందోళనతో మారుమూల తండాల్లోని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాధవ్ అలియాస్ గొల్లూరి రాములు ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో మంగళవారం బీఎస్ఎ్ఫ్ జవాన్లపై ప్రతీకార దాడులకు తెగబడ్డారు. దీంతో సరిహద్దు ప్రాంతాల తోపాటు విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో పోలీసు యంత్రాం గం అప్రమత్తమైంది. మన్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పట్టున్న జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి ప్రాంతాలకు మావోయిస్టులు చేరుకుంటారనే అనుమానంతో భద్రత సిబ్బంది అడవిని జల్లెడపడుతున్నారు. పెద్ద ఎత్తున బలగాలను ఏజెన్సీకి తరలిస్తున్నారు. ఒకవైపు గాలింపు, మరోవైపు ముమ్మర తనిఖీలు చేపడుతూనే ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెట్టారు. ఇరువర్గాల ప్రతీకార దాడుల ప్రభావం ఈస్ట్ డివిజన్‌పై పడింది. ‘తూర్పు’ పోలీసుల ముమ్మర గాలింపు కొయ్యూరు: తూర్పు గోదావరి పోలీసులు విశాఖ సరిహద్దుల్లో కూంబింగ్‌ను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా ‘తూర్పు’ పోలీసులు కొయ్యూరు మండలంలో అనేక గ్రామాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలుగా గుర్తింపు పొందిన పలకజీడి దాటి లోతట్టు ప్రాంతాలైన మర్రిపాకలు, నీలవరం, గంగవరం, ఈదులబంద తదితర గ్రామాలలో కూంబింగ్ జోరు పెంచారు. జీకేవీధి మండలానికి అనుకుని ఉన్న పుట్టకోట,పెదలకం, మండపల్లి వరకు కూంబింగ్ నిర్వహించారు. ఈ నెల 14న సుమారు 150 మంది వరకు మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పలకజీడి సమీపంలోకి వచ్చారు. వారిలో 25 మంది పాఠశాల వద్దకు వచ్చి నల్లజెండాలు పాతి స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మిగిలిన దళసభ్యులు సమీపంలో టేకు ప్లాంటేషన్ వద్ద కాపు కాశారు. మావోయిస్టులు అక్కడ పాఠశాల గురించి ఆరా తీసి, అక్కడే ఉద్యోగం చేస్తున్న అటవీ శాఖ గార్డు రమణను హెచ్చరించి ఉద్యోగం మానేయాలని కొట్టినట్టుగా తెలిసింది. విషయం తెలిసిన తూర్పుగోదావరి పోలీసులు వెంటనే పలకజీడి నుంచి కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఆ ప్రాంతంలో దాదాపు 50 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న అడవిని జల్లెడ పట్టారు. గుత్తికోయల జాడలు? పలకజీడి వచ్చిన మిలీషియా సభ్యుల్లో ఎక్కువ మంది గుత్తి కోయలున్నట్టు తెలుస్తోంది. వారు మాట్లాడిన తీరు, చంపేస్తామని భయపెట్టిన విధానం చూస్తుంటే ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారు కూడా అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈస్టు డివిజన్ పరిధిలోకి తూర్పుగోదావరి కూడా వస్తుంది. గతంలో నాగులకొండ, యల్లవరం దళాలు ఎక్కువగా తూర్పు మన్యంలో తిరిగేవి. 2001లో ఏరియా కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత కోనలోవ పేరిట ఒకదానిని ఏర్పాటు చేసినా అది పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మావోయిస్టుల కదలికలు విశాఖ మన్యంలోనే అధికం అయ్యాయి. ఇప్పుడు మావోయిస్టులు తూర్పుగోదావరి సరిహద్దుల వరకు రావడంతో పోలీసులు అక్కడ గాలింపు చేపట్టారు. రంపచోడవరం ఏఎస్పీ ఆరా తూర్పుగోదావరి మన్యంలో మావోయిస్టుల కదలికలపై రంపచోడవరం ఏఎస్పీ ఆరా తీస్తున్నారు. పలకజీడిలో చోటు చేసుకున్న సంఘటన గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ ఉద్యోగి రమణను కూడా ఆయన విచారించినట్టు తెలిసింది.