గిరిజనులే సమిథలు
పోలీసులు-మావోయిస్టుల పోరులో గిరిజనులే సమిథలవుతున్నారు. గొబ్బరిపాడు ఘటనే ఇందుకు తార్కాణం. మావోయిస్టులు అపహరించుకుపోయిన ఇద్దరిలో ఒకరిని కాల్చి చంపి, మరొకరిని తీవ్రంగా కొట్టి విడిచిపెట్టారు. మందుపాతర పేలినా.. ఎన్‌కౌంటర్ జరిగినా మొదట బలయ్యేది గిరిజనులే..చివరకు మావోయిస్టులకు భయపడి గ్రామాలను వదిలిపోతున్న దుస్థితి. ఒకప్పుడు మావోయిస్టుల సమాచారం చెప్పాలని గిరిజనుల ఇళ్లను పోలీసులు ధ్వంసం చేసేవారు. ఇప్పుడు ఆ పనిని మావోయిస్టులు చేస్తున్నారు.
- గిరిజనుడ్ని కాల్చి చంపిన మావోయిస్టులు
- ఎన్‌కౌంటర్ జరిగినా.. మందుపాతర పేలినా..మారుమూల ప్రాంతాల వారికి నరకం
- వీరవరం సంఘటన నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న దళసభ్యులు
కొయ్యూరు/ముంచంగిపుట్టు: ఈస్టు డివిజన్‌లో 1980 దశకంలో మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైననాటి నుంచి గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. మందుపాతరలు పేలిన సంఘటనలో ఎందరో గిరిజనులను పోలీసులు అరెస్టులు చేశారు. అప్పట్లో టాడా లేదా పోటా కింద జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గారు. అదే సమయంలో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటే దానికి పోలీసు ఇన్‌ఫార్మర్‌లే కారకులంటూ ఎక్కువ మందిని చంపారు. ఒక విధంగా చనిపోయిన మావోయిస్టుల కంటే వారి చేతిలో చంపబడిన గిరిజనులే అధికం.
జూన్ 20న గబ్బురపాడులో జరిగిన ఎన్‌కౌంటర్లో సూర్యం అనే మావోయిస్టు మరణించాడు. దానికి ముంచంగిపుట్టు మండలం గొబ్బరిపాడు గ్రామస్తులే కారకులంటూ గ్రామంలోని జీనబంధు ఇంటిని శనివారం వేకువజామున పేల్చివేశారు. పాంగి రామన్న,లైకోన్ ఇళ్లను ధ్వంసం చేశారు. పాంగిరామన్న(28)ను తీసుకెళ్లి పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు కాల్చిచంపారు. దోబులును కొట్టి విడిచిపెట్టారు. దోబులు రాత్రి అంతా మృతదేహం వద్ద లేవలేని స్థితిలో ఉండిపోయాడు. సరిహద్దు ఒడిశా అర్లోయిపడా గ్రామస్తుల సమాచారంతో ఆదివారం కుటుంబ సభ్యులు వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చి ఉదయం పది గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.ప్రస్తుత పరిస్థితులతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొందరు గ్రామాలను వదిలిపోతున్నారు.
మొదట బలయ్యేది గిరిజనులే..
రెండు దశాబ్దాల కిందటి వరకు పోలీసులను చూస్తే గిరిజనులు భయపడేవారు.. మావోయిస్టుల సమాచారం చెప్పాలని నానా విధాల చిత్రహింసలు పెట్టేవారు. కేసులు పెట్టి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గే విధంగా చేసేవారు. దాని మూలంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన పోలీసులు గిరిజనుల్లో మార్పును తీసుకురావడం ప్రారంభించారు. దీని కోసం ఎన్నో పథకాలను చేపట్టారు. సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. చివరకు ఉద్యోగాలకు అవసరమైన కేరీర్‌గెడైన్స్‌ను కూడా అందిస్తున్నారు.
గతంలో మందుపాతర పేలుళ్లలో పోలీసులు మరణిస్తే అనుమానితులను ఇబ్బందులు పెట్టేవారు. కేసులు న మోదు చేసేవారు. ఎన్‌కౌంటర్లో ఎవరైనా మావోయిస్టులు మరణిస్తే దానికి కారణమైన వారిని తెలుసుకునేవారు. ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించవద్దని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించేవారు. ఇళ్లు ధ్వంసం చేయడం లాంటివాటికి పాల్పడేవారు కాదు. అయితే వీరవరం ఘటనలో శరత్,గణపతిలను గిరిజనులే చంపేయడాన్ని దళసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.